For Money

Business News

మాధవికి రోజులు దగ్గరపడ్డాయా?

సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్‌కు రోజులు దగ్గర పడినట్లు కన్పిస్తోంది. ఆమె వరుస వివాదాల్లో చిక్కుకోవడం కేంద్రానికి రుచించడం లేదని వార్తలు వస్తున్నాయి. అదానీ షేర్ల వ్యవహారంతో ఆమె పాత్ర గత కొన్ని నెలల నుంచి జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. తాజాగా సెబీ చీఫ్‌గా ఉంటూనే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఆమె జీతభత్యాలు తీసుకున్నట్లు కాంగ్రెస్‌ చేసిన ఆరోపణ కేంద్రానికి ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ వివరణ ఇచ్చిన తరవాత కూడా కాంగ్రెస్‌ మరికొన్ని కొత్త ప్రశ్నలను సంధించింది. ఇదే సమయంలో సెబీకి చెందిన అధికారులే ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సెబి ఆఫీస్‌లో ఆమె తన సహచర అధికారుల పట్ల ప్రవర్తించే తీరుపై తాజా ఫిర్యాదులు వచ్చాయి. ఆమె పని సంస్కృతిపై వీరు ఫిర్యాదు చేశారు. టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి సెబీ అధికారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారని జాతీయ మీడియా రాస్తోంది.సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానించడం ఆమెకు అలవాటుగా మారిపోయిందని అధికారులు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ప్రతీ నిమిషం టీమ్ సభ్యుల కదలికలపై ఆమె నిఘా పెట్టారని, సాధ్యంకాని లక్ష్యాలను ఉద్యోగులకు విధిస్తూ… వేధిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. విధిస్తున్నారన్నారు. ఆమె వ్యవహార శైలి తమ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు. ఇదే సమయంలో జీ గ్రూప్‌ సంస్థల అధినేత సుభాష్‌ చంద్ర కూడా మీడియా సమావేశం పెట్టి మాధవిపై తీవ్ర విమర్శలు చేశారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి ఆమె అనుసరించిన వైఖరిని ఆయన ఎండగట్టారని. తనన ఆమె టార్గెట్‌ చేశారని సుభాష్‌ చంద్ర ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సుభాష్‌ చంద్ర మీడియా సమావేశం కూడా కేంద్రాన్ని డిఫెన్స్‌లో పడేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవి తనకు తాను రాజీనామా చేస్తారా? లేదా కేంద్రం తొలగిస్తుందా అన్న చర్చ ఇపుడు క్యాపిటల్‌ మార్కెట్‌లో వినిపిస్తోంది.