తమిళనాడులో లులూ గ్రూప్ భారీ పెట్టుబడులు
యూఏఈకి చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ లులూ గ్రూప్ తమిళనాడులో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో ఇది వరకు భారీ ప్రకటించిన ఈ గ్రూప్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత ఆ రాష్ట్రానికి గుడ్‌బై చెప్పింది. ఇపుడు యూఏఈ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లో చర్చలు జరిపింది. తమిళనాడులో షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్స్, ఫుడ్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కోసం రూ .3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడంతో పాటు ఆ మేరకు ఎంఓయూ కుదుర్చుకుంది . ముఖ్యమంత్రి స్టాలిన్, లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు . ఒప్పందం ప్రకారం.. కోయంబత్తూరులోని లక్ష్మీ మిల్స్‌లో ఈ ఏడాది చివరినాటికల్లా హైపర్ మార్కెట్ ప్రారంభం కానుంది. చెన్నైలో 2024 నాటికి లులూ గ్రూప్ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయనుంది. మధ్యప్రాచ్య దేశాలకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కోసం ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. చెన్నైతో పాటు కోయంబత్తూరు, సేలం, మధురై, తిరుచ్చిలో కూడా పెట్టుబడి అవకాశాలను పరిశీలించనున్నట్లు లులూ గ్రూప్ తెలిపింది.