బాండ్ టార్గెట్ రూ.12,000 కోట్లు!
మద్యనిషేధం సంగతేమోగాని… ఆ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం జనం నుంచి వేల కోట్లను గుంజుతోంది. ప్రభుత్వం కేవలం రూ. 2000 కోట్లు మాత్రమే సేకరించేందుకు బాండ్ మార్కెట్‌ను ఆశ్రయించిందని… విశేష ఆదరణ అంటే రూ.10,000 కోట్లకు ఆఫర్లు వస్తే కేవలం రూ. 8000 తీసుకుందని ప్రభుత్వ వర్గాలు అన్నాయి. కాని నిజానికి ప్రభుత్వం ఈ బాండ్ సేకరణ ప్రక్రియ ప్రారంభించినపుడు టార్గెట్ రూ. 12,000 కోట్లు. ఒకేసారి ఇంత మొత్తం సమీకరిస్తే వ్యతిరేకత వస్తుందని కేవలం రూ.2000 కోట్లని మభ్య పెట్టారు. నిజానికి ప్రభుత్వ టార్గెట్ రూ.12,000 కోట్లు. ఈ స్థాయిలో సమీకరణకు రంగం సిద్ధి చేసేందుకు అనేక అంశాలు ప్రైవేట్ రేటింగ్ ఏజెన్సీలకు ఇచ్చింది ప్రభుత్వం. ఇపుడున్న మద్యం విధానం మారదని… ఇక మద్యం నిషేధం ఉండదని స్పష్టం చేసింది. పైగా ఒకవేళ నిషేధం విధించే పరిస్థితి వస్తే మూడు నెలల్లో వడ్డీతో సహా సఅలు చెల్లించేస్తామని పేర్కొంది. ఇపుడున్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం అంత మొత్తం సర్దుబాటు చేయలేదు. మున్ముందు వచ్చే ప్రభుత్వం కూడా చేయలేని విధంగా షరతులు విధించింది. ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి… డైలీ కలెక్షన్స్ అందులో వేస్తామని పేర్కొంది. పైగా వచ్చిన మొత్తం నుంచి వడ్డీ మూడు నెలలకు ఒకసారి తీసుకునేలా ఓకే చెప్పింది. పైకి 7.5 శాతమని చెప్పి…ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 9.5 శాతం వడ్డీకి రుణం తెచ్చినట్లు తెలుస్తోంది. బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఆర్థికంగా ఎంత బలంగా ఉందో రేటింగ్ ఏజెన్సీలకు తెలిపింది. చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయే ఏడాది అంటే 2018-19లో కార్పొరేషన్‌కు వచ్చిన మద్యం ఆదాయం రూ. 8400 కోట్లని పేర్కొంది. 2019-20లో రూ. 9000 కోట్లని వెల్లడించింది. అయితే 2020-21లో ఆదాయాన్ని రూ. 18,047 కోట్లకు తీసుకెళ్లింది. ఇక 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి మధ్య కాలంలో కార్పొరేషన్ రూ.18,328 కోట్లని పేర్కొంది. సగటున నెలకు రూ. 2000 కోట్లపైనే అన్నమాట. ఇదే ట్రెండ్ కొనసాగితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ ఆదాయం దాదాపు రూ. 25,000 కోట్లకు చేరుతుందన్నమాట. మద్య నిషేధం పేరుతో మూడేళ్ళలో రాష్ట్ర మద్యం ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందన్నమాట.