For Money

Business News

ఎల్‌ఐసీ ఇంకా పడుతుంది!

ఎల్‌ఐసీ అంటే బీమా. కాని ఆ షేర్‌ ధరకు మాత్రం బీమా లేదు. ఇన్వెస్టర్లకు అంతకన్నా ధీమా లేదు. దీర్ఘకాలానికి అంటూ దీర్ఘాలు తీసుకోవడం వినా.. ఈ షేర్‌ ఇప్పట్లో పెరుగుతుందని ఓ అనలిస్ట్‌ కూడా చెప్పడం లేదు. అంతకన్నా చిత్రం… లిస్ట్‌ ధర వస్తుందని పొరపాటున కూడా ఎవరూ అనడం లేదు. ఇవాళ ఎల్‌ఐసీ షేర్‌ ఆల్‌ టైమ్‌ కనిష్ఠ ధర రూ.731.80 (NSE)ని తాకి రూ. 752.90 వద్ద ముగిసింది. అంటే ఇష్యూ ధర నుంచి 20 శాతం పతనం అయినట్లు. రూ. 15 లక్షల కోట్లు అని అనుకన్న కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4.76 లక్షల కోట్లకు పడిపోయింది. ఓపెనింగ్‌ రోజే ఈ షేర్‌ 9 శాతం నష్టంతో లిస్టయింది. అపుడు కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 5.7 లక్షల కోట్లు. అంటే కేవలం 20 రోజుల్లో లక్ష కోట్ల రూపాయలు తగ్గిందన్నమాట. అధిక రిస్క్‌ భరించే వారు, దీర్ఘాకాలం వేచి ఉండేవారు ట్రెండ్‌ రివర్సల్‌ కోసం వెయిట్‌ చేయొచ్చని షేర్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రవి సింగ్‌ ఎకనామిక్‌ టైమ్స్‌తో అన్నారు. రానున్న ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఈ షేర్‌ రూ.700 దాకా పడే అవకాశముందని అన్నారు. ఇక్కడి నుంచి షేర్‌ పడితే కొనుగోలు చేయొచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌కు చెందిన సంతోష్‌ మీనా అంటున్నారు. మరోవైపు ఎమ్‌కే గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ ఈ షేర్‌ అమ్మాల్సిన పనిలేదని, అట్టి పెట్టుకోవచ్చని అంటూ… ఈ షేర్‌ ధర రూ.875కు వెళ్ళే అవకాశం ఉందని అన్నారు. అంటే ఇష్యూ ధర రావడం కష్టమన్నమాట. చాలా మంది విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు ఎల్‌ఐసీ కంటే బీమా రంగంలోకి ప్రైవేట్‌ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసినవారు… ప్రస్తుత స్థాయి లేదా ఇంకా పడినపుడు కొని యావరేజ్‌ చేసుకోవడం… ట్రెండ్‌ రివర్సల్‌ కోసం వెయిట్‌ చేయడం మంచిది. లేదా కొత్తగా ఎంటర్‌ అయ్యేవారు ఎల్‌ఐసీ కన్నా మరో ప్రైవేట్‌ బీమా కంపెనీని ఎంచుకోవడం బెటర్‌. ఎల్‌ఐసీలోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే… ధర మరింత పతనం అయిన తరవాత ఇన్వెస్ట్‌ చేయడం మంచిది.