For Money

Business News

LIC IPO: రీటైల్‌ కోటా కూడా పూర్తి

ఎల్‌ఐసీ ఓఐపీలో రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన కోటా కూడా పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. మధ్యాహ్నానికి ఈ కోటా 1.06 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ మొత్తంగా చూసుకుంటే 1.16 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయింది. పాలసీదారుల నుంచి ఇవాళ కూడా భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కోటా కింద 3.52 రెట్ల దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఉద్యోగులు కూడా అనూహ్యంగా స్పందిస్తున్నారు. వీరికి కేటాయించిన కోటా కూడా 2.62 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయింది. పబ్లిక్‌ ఆఫర్‌ కోసం రేపు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. సోమవారం ఇష్యూ క్లోజ్‌ కానుంది.
తగ్గిన ప్రీమియం…
ఎల్‌ఐసీకి పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తన్న స్పందన బట్టి ఆ షేర్‌ ప్రీమియం స్పందిస్తోంది. అనధికార మార్కెట్‌లో ఈ ఇష్యూ ప్రీమియం మొన్నటి వరకు రూ.85 ఉండగా, ఇవాళ రూ.65కు తగ్గింది. ఇష్యూకు స్పందన భారీగా లేకపోవడంతో… లిస్టింగ్‌ తరవాత కొనుగోళ్ళపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు లిస్టింగ్‌ రోజున పెద్ద ప్రీమియం ఉండదని.. దరఖాస్తు చేయడం కంటే లిస్టింగ్‌ తరవాత కొనుగోలు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. దీంతో రీటైల్‌ ఇష్యూ కోటా పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ కావడానికి మూడు రోజులు పట్టింది. పైగా మార్కెట్‌ భారీగా క్షీణిస్తున్నందున అనుభవమున్న ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్‌లో బాగా తగ్గిన షేర్లపై మక్కువ చూపుతున్నారు.