For Money

Business News

మార్చిలో ఎల్‌ఐసీ ఐపీవో

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మెగా ఐపీవో మార్చిలో రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను వచ్చే వారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపం) కార్యదర్శి తుహిన్‌ పాండే వెల్లడించారు. ఐపీవోకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ అనుమతి రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే ప్రాస్పెక్టస్‌ సెబీకి సమర్పిస్తారు. మార్చి నెలలో మార్కెట్లోకి ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే అవకాశం ఉందని తుహిన్‌ పాండే వివరించారు. ఎల్‌ఐసీ ఐపీవోలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీలో మార్పులకు ఆమోదాన్ని కోరుతూ ఒక ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు ఉంచనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ తెలిపారు. ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువకు సంబంధించి అధికారికం ఎలాంటి సమాచారం లేకున్నా, 865 కోట్ల డాలర్లు (రూ.64,722 కోట్లు)గా ఖరారు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బ్రాండ్‌ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక ప్రకారం 2021లో ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ అంతక్రితం ఏడాదికంటే 6.8 శాతం వృద్ధిచెంది 811 కోట్ల డాలర్ల నుంచి 865 కోట్ల డాలర్లకు పెరిగింది.