For Money

Business News

ఎల్‌ఐసీ మోడీ ఎందుకు అమ్ముతున్నారు?

లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక కేంద్ర సంస్థలను అమ్మేస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. అన్ని రకాలుగా పేదలను, రైతులను కేంద్ర ప్రభుత్వం అబద్ధాలతో ముంచేస్తోందని అన్నారు. పేదలకు అందాల్సిన సబ్సిడీలో కోత విధించారని…ఎరువుల ధరలు పెంచారని ఆయన ఆరోపించారు.
మోడీది చిన్న బుద్ధి
ప్రధాని నరేంద్ర మోడీ చాలా హ్రస్వ దృష్టి ఉన్ననేత అని, ఆయన ఇప్పటికీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆయన భావిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు.   సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణతో సంప్రదించి హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ప్రారంభించామని అన్నారు. అంతర్జాతీయ వివాదాలను సకాలంలో సెటిల్‌మెంట్‌ చేసేందుకు దీనిని తీసుకువచ్చామన్నారు. దీనికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఇపుడు హైదరాబాద్‌లో ఓ సెంటర్‌ ఉందని, అదనంగా ఇంకో సెంటర్ పెడుతున్నామంటే సరిపోయేదని… కాని హైదరాబాద్‌ ప్రస్తావన లేకుండా అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ పెడతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలా అంటారని కేసీఆర్‌ నిలదీశారు. అంటే మరో శిఖండిని అక్కడ పెడతారా అని ఆయన ప్రశ్నించారు.
క్రిప్టో కరెన్సీని ఆమోదించినట్లేనా?
క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. క్రిప్టో కరెన్సీని ఆమోదంచమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు… ఇపుడు 30 శాతం పన్ను వేస్తామని ఎలా అంటారని కేసీఆర్ నిలదీశారు. అంటే ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని ఆమోదిస్తున్నట్లా అని అన్నారు. అధికారికంగా ప్రభుత్వం ఆమోదించినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. ఆమోదం లేకపోతే క్రిప్టో కరెన్సీపై ఎలా పన్ను వసూలు చేస్తారని కేసీఆర్‌ నిలదీశారు. పన్ను వేయడానికి ప్రాతిపదిక ఏదని ఆయన అన్నారు.