అదరగొట్టిన ఐటీసీ
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 16129 కోట్ల టర్నోవర్ (ఎక్సైజ్ డ్యూటీ మినహా)పై రూ. 4466 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ టర్నోవర్ 27 శాతం పెరగ్గా, నికర లాభం 21 శాతం పెరిగింది. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు రూ. 15884 కోట్ల టర్నోవర్‌పై రూ. 4315 కోట్ల నికర లాభం రావొచ్చని అంచనా వేశారు. ఈ రెండు అంశాల్లోనూ ఐటీసీ విశ్లేషకుల అంచనాను మించింది. సిగరెట్ల అమ్మకాలు 23 శాతం పెరిగి రూ. 6953 కోట్లకు చేరాయి. ఐటీసీ నికరలాభంలో 80 శాతం సిగరెట్ల నుంచే రావడం విశేషం. ఎప్ఎంసీజీ విభాగం కూడా 21 శాతం వృద్ధి రేటుతో రూ. 4885 కోట్లకు చేరింది. అలాగే హోటల్ బిజినెస్ రికార్డు స్థాయిలో 82 శాతం పెరిగి రూ. 536 కోట్లకు చేరింది. ఇక వ్యవసాయ విభాగం 44 శాతం పెరిగి రూ. 3997 కోట్లకు చేరింది. ఇక పేపర్ బోర్డ్ విభాగం కూడా 25 శాతం వృద్ధి చెంది రూ. 2288 కోట్లకు చేరింది.