అంచనాలను మించిన పనితీరు
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ బంపర్ ఫలితాలను ప్రకటించి మార్కెట్‌ను ఆశ్చర్యపర్చింది. మార్కెట్ అంచనాలను మించి నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,169 కోట్ల స్టాండ్అలోన్ నికర లాభం ప్రకటించింది. మార్కెట్ కంపెనీ నికర లాభం రూ. 3985 కోట్ల ఉంటుందని అంచనా వేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 3013 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంటే నికర లాభం 38 శాతం పెరిగిందన్నమాట. అలాగే ఆదాయం కూడా 41 శాతం వృద్ధితో రూ. 12959 కోట్ల నుంచి రూ. 18320 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనా ప్రకారం కంపెనీ టర్నోవర్ రూ. 15044 కోట్లకు పరిమితం అవుతుందని భావించారు. అయితే కంపెనీ అంచనాలను మించిన టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ 32.7 శాతం మార్జిన్‌ను ప్రకటించింది. ఒక్క సిగరెట్ విభాగం నుంచే కంపెనీ రూ. 6608 కోట్ల టర్నోవర్ లభించింది. మూడో వంతు కంటే ఎక్కువ టర్నోవర్ ఈ విభాగం నుంచి వచ్చింది. ఒక ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 4,451 కోట్ల టర్నోవర్, హోటల్ రంగం నుంచి రూ. 554 కోట్ల టర్నోవర్ వచ్చింది. ఇక పేపర్ విభాగం నుంచి వచ్చిన టర్నోవర్ రూ. 2267 కోట్లు. నిజానికి ఈ విభాగం టర్నోవర్ ఏడాది కాలంలో 43 శాతం పెరగ్గా, హోటల్ విభాగం టర్నోవర్ 332 శాతం పెరిగింది.