For Money

Business News

ఐవోసీ 1:2 బోనస్‌ షేర్లు

గడిచిన మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) నికర లాభం 31.4 శాతం తగ్గింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను రూ.6,021.88 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.8,781.30 కోట్లు. ఆదాయం మాత్రం ఈ త్రైమాసికంలో రూ.2.06 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇది రూ.1.63 లక్షల కోట్లుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో లాభదాయకతపై ప్రభావం పడింది. పనితీరు డల్‌గా ఉన్నా వాటాదారులకు బోనస్‌ షేర్లు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ఇన్వెస్టర్ల దగ్గరున్న ప్రతి రెండు షేర్లకు గాను ఒక్క షేరును బోనస్‌గా ఇస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి రెండు షేర్లకు ఒక్క షేరు ఉచితంగా కేటాయించనున్నది. మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు రూ.3.60(బోనస్‌ కంటే ముందు) తుది డివిడెండ్‌తోపాటు రూ.2.40(బోనస్‌ తర్వాత) తుది డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఇప్పటికే సంస్థ రూ.9 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించింది.