నిరుత్సాహపర్చిన ఇన్ఫోసిస్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. కాకపోతే మరీ నిరుత్సాహకరంగా మాత్రం లేవు. జూన్నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 5360 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 5195 కోట్లు. అయితే మార్కెట్ ఈసారి రూ. 5550 కోట్ల నికర లాభాన్ని అంచనా వేసింది. అయితే కంపెనీ టర్నోవర్ మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈ క్వార్టర్లో 23.6 శాతం పెరిగి రూ.34150 కోట్ల నుంచి రూ. 34470 కోట్లకు చేరింది. ఈ విషయంలో మార్కెట్ అంచనాలను అందుకుంది. అయితే స్థిర కరెన్సీని పరిగణనలోకి తీసుకుంటే ఆదాయం 21.4 శాతమే పెరిగింది. అంటే కరెన్సీ మార్పు వల్ల టర్నోవర్ 2 శాతంపైగా పెరిగిందన్నమాట. కంపెనీ మార్జిన్ 21 శాతం నుంచి20.1 శాతానికి పడిపోవడం ఆందోళన కల్గించే అంశం. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ రెవెన్యూ 6.8 శాతం పెరగ్గా, నికర లాభః 5.7 శాతం తగ్గింది. అలాగే లాభాల మార్జిన్ కూడా 0.6 శాతం తగ్గి 6.956 శాతం నుంచి 6.914 శాతానికి పడిపోయింది. మార్కెట్ అంచనాలను అందుకునే విషయంలో కంపెని మిశ్రమ ఫలితాలు సాధించింది. టర్నోవర్ విషయంలో అంచనాలను అధిగమించినా… నికర లాభం విషయంలో నిరాశపర్చింది. మరి ఫలితాలను మార్కెట్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.