For Money

Business News

2001 తరవాత ఇదే…

ఉదయం నుంచి చూస్తుండగానే ఐస్‌ ముక్కలా షేర్ల ధరలు కరిగిపోయాయి. ఇప్పటి వరకు మార్కెట్‌కు అండగా నిలిచిన ఫార్మా రంగం షేర్లు కూడా ఇవాళ నీరుగారిపోయాయి. ఉదయం నుంచి ఐటీ షేర్లు కాస్త గ్రీన్‌లోఉన్నా… క్రమంగా అవి కూడా నామమాత్రపు లాభాలకు పరిమితమైపోయాయి. ఈవారంలో నిఫ్టికి వచ్చిన లాభాలన్నీ ఇవాళ కరిగిపోయాయి. రేపు కూడా రెడ్‌లో ముగిస్తే… వరుసగా 9వ వారం నిఫ్టి నష్టాల్లో ముగిసినట్లు అవుతుంది. రేపు లాభాలు వచ్చినా… సగటున ఈ వారం నష్టంతో ముగిసే ఛాన్స్‌ ఎక్కువ. నిఫ్టి ఇలా వరుసగా 9 వారాలు నష్టాల్లో ముగియడం 2001 తరవత అంటే డాట్‌ కామ్‌ క్రాష్‌ తరవాత ఇదే మొదటిసారి. కోవిడ్‌ కన్నా దారుణంగా తయారైంది పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి మిడ్‌ సెషన్‌ వరకే మార్కెట్‌ క్యాప్‌ పది లక్షల కోట్ల రూపాయలకుపైగా తగ్గింది. స్టాక్‌ మార్కెట్లు దేశ ఆర్థిక స్థితికి ప్రతిబింబం అంటారు. ప్రభుత్వం చెప్పిన జీడీపీ లెక్కలు బోగస్‌ అని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఇపుడు ఇన్వెస్టర్లు కూడా నమ్ముతున్నారు. అయినకాడికి అమ్మేస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. 22,182 ఈ ఏడాది కనిష్ఠ స్థాయి. దీన్ని కూడా ఈ వారం నిఫ్టి బ్రేక్‌ చేస్తుందేమో చూడాలి.

ప్రధాన కారణం ఏఐ
మనదేశంలో ఏఐ లేకపోవడం ఎంత నష్టాన్ని కల్గిస్తుందో ఇపుడిపుడే ఇన్వెస్టర్లకు తెలుస్తోంది. ఇక భారత మార్కెట్‌లోఏం చేసి షేర్లు కొనాలన్న విదేశీ ఇన్వెస్టర్ల ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేకపోయింది. ఇవాళ శామ్‌సంగ్‌ కంపెనీ రెండోత్రైమాసికంలోతాను ప్రకటించబోయే నికర లాభం గురించి అంచనా ఇచ్చింది. జులై నుంచి సెప్టెంబర్‌ వరకు అంటే మూడు నెలల్లో 8000 కోట్ల డాలర్ల నికర లాభం ప్రకటిస్తామని పేర్కొంది. ప్రపంచ చరిత్రలో ఒక టెక్‌ కంపెనీ మూడు నెలల్లో ఈ స్థాయి లాభాలు ప్రకటించడం ఇదే మొదటిసారి. చూస్తుంటే మన దేశంలో ఉన్న అన్ని కంపెనీల నికర లాభం కూడా ఆ స్థాయిలో ఉండదేమో. ఇలాంటి సీన్‌ మనదేశంలో లేనందున రెండేళ్ళ నుంచే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ నుంచి వైదొలగుతున్నారు. దీనికి సమాధానంగా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సాక్షిగా విదేశీ ఇన్వెస్టర్లను ఎగతాళి చేశారు. ఉంటే ఉంటారు.. పోతే పోతారు… మన రీటైల్‌ ఇన్వెస్టర్లు ఉన్నారుగా అంటూ సమాధానం ఇచ్చారు. మన ఐటీ ఎగుమతుల్లో ఎలాంటి పురోగతి లేదని, మనకు వస్తున్న డాలర్లు నిలకడగా ఉన్నాయని… పెరగడం లేదని ఆమె గుర్తించ లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సంచలనం సృష్టిస్తున్నా… మన నేతలు గత చరిత్రను తవ్వడంలో బిజీగా ఉన్నారు. అమెరికా, ఇరాన్‌ యుద్ధంగా మొత్తం పరిస్థితి తలకిందులైంది. క్రూడ్‌ కొనడానికి మన దగ్గర డాలర్లు లేవు. వస్తున్న డాలర్లు సరిపోవడం లేదు. కొన్ని నెలలు కాదు… దాదాపు రెండేళ్ళ వరకు క్రూడ్‌ వంద డాలర్లకు దిగదని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎన్నారైల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాస్తో కూస్తో డాలర్లు తెచ్చే విదేశీ ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు. మర డాలర్లు ఎక్కడి నుంచి వస్తాయి? అత్యధిక వడ్డీతో ఎన్నారైల నుంచి మొన్న లక్షా పాతిక వేల కోట్ల డాలర్లు తెచ్చారు. అవి ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నెలతిరక్కనే రూపాయి మళ్ళీ కుదేలైపోయింది.
ఆర్బీఐ షాక్‌…
సాధారణంగా దేశీయంగా ఉత్పత్తి, డిమాండ్‌ అనూహ్యంగా పెరిగి… ధరలు మండి పోతున్నపుడు… అంటే ద్రవ్యోల్బణం హద్దులు దాటితే అపుడు వడ్డీ రేట్లు పెంచుతారు. కాని దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన స్థాయిలోనే ఉంది. మరి వడ్డీ రేట్లను ఎందుకు పెంచినట్లు? ఆర్బీఐ పెంచకున్నా… గత మూడేళ్ళుగా బ్యాంకులు పెంచుతూనే ఉన్నాయి. నిన్నటి దెబ్బతో అర్థమైనదేమిటంటో…. ప్రభుత్వం ఏం చేయలేని స్థితిలో ఉంది. అమెరికాలో పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌తో ఆర్బీఐకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే బాండ్‌ కొంటున్నవారు అధికవడ్డీ కోరుతున్నారు. ఇతర దేశాల్లో పెరుగుతున్నపుడు మీరెందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వంటి సీఎంలు కూడా 9.50 శాతం వడ్డీతో రుణాలు తెస్తున్నారు. దీంతో వడ్డీ రేట్లు పెంచకతప్పలేదు ఆర్బీఐకి. వడ్డీ రేట్ల పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌… దానికి అనుబంధంగా ఉన్న పాతిక పరిశ్రమలపై ప్రభావం పడింది. మున్ముందు గడ్డు పరిస్థితి ఉందని ఇన్వెస్టర్లకు తెలియడంతో…అయిన కాడికి తమ వద్ద ఉన్న షేర్లను అమ్ముతున్నారు.

Leave a Reply