విద్యుత్ సంక్షోభంలో దేశం?
గత కొన్ని రోజులుగా మీడియా దాస్తున్న పచ్చి నిజం ఇపుడు.. దాచలేని స్థాయికి చేరింది. చైనా విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్నే కాదు… భారత్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గత కొన్ని వారాలుగా భారత్‌లో అనే వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫోన్ దగ్గర నుంచి ఫార్మా రంగం వరకు. దీనికి కారణం చైనా విద్యుత్ సంక్షోభం. డిమాండ్ సరిపడా విద్యుత్ తయారు చేయలేకపోవడంతో… చైనాలో అనేక కంపెనీలు మూత పడ్డాయి. దీంతో చైనాపై ఆధారపడ్డ అనేక భారత కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుక్కొంటున్నాయి. ఇపుడు ఈ సంక్షోభం భారత్‌ను కూడా ముసుకుంటోంది…
విద్యుత్ సరఫరాపై ప్రభావం
దాదాపు పక్షం రోజుల నుంచి భారత్‌లో ఏర్పడబోయే విద్యుత్ సంక్షోభం గురించి సీఎన్‌ఎన్ నుంచి బీసీసీ మీడియా విస్తారంగా రాసినా… మన మీడియా మాత్రం మిన్నకుండిపోయింది. ఇపుడు పరిస్థితి చేయిదాటి పోయింది. కరోనా తరవాత అన్ని రంగాలు పూర్వ స్థాయిలో ఉత్పత్తి మొదలు పెట్టడంతో డిమాండ్ పెరిగింది. కాని విద్యుత్ ఉత్పత్తి ఆ మేరకు పెరగడం లేదు. ముఖ్యంగా బొగ్గు సరఫరా తగ్గడంతో దేశీయ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా కంటైనర్ల కొరత కూడా ఏర్పడింది. దీంతో దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల ఇటీవల 40 శాతం దాకా పెరిగిందని బీబీసీ పేర్కొంది. విద్యుత్ కు అధిక చార్జీలు ఇస్తేనే తాము ఉత్పత్తి చేస్తామని విద్యుత్ కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే పీకలోతు నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనేక విద్యుత్ ప్లాంట్లలో కేవలం అయిదు రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉంది. గతంలో కనీసం 15 రోజుల స్టాక్ ఉండేది. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుపై ఎక్కువగా ఆధారపడటంతో ఇపుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వస్తోంది. చలికాలం వచ్చే వరకు విద్యుత్ డిమాండ్ తగ్గదు. ఈలోగా పండుగలు ఉన్నాయి. వినియోగం ఇంకా పెరుగుతోంది. మరి ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.