ఐపీఓకు ILS హాస్పిటల్స్
కోల్‌కతాలో ILS హాస్పిటల్స్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్న GPT హెల్త్‌కేర్ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఆఫర్‌కు సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 500 కోట్ల వరకూ సమీకరించనుంది. 17.5 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా జారీ చేయనుంది కంపెనీ. అలాగే ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లలో 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మనున్నారు. ప్రస్తుతం కంపెనీలో GPT సన్స్ 67.3 శాతం షేర్లను, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బనియన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ 2 LLC 32.6 శాతం వాటా ఉంది. బనియన్ ట్రీ 2.6 కోట్ల షేర్లను అమ్మనుంది. సెప్టెంబర్ 30, 2021 నాటికి 556 పడకల సామర్థ్యంతో ఉన్న నాలుగు మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఇటీవలే రాంచీలో రూ.50 కోట్ల పెట్టుబడితో 140 పడకలతో కూడిన ఆసుపత్రి కోసం కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది.