ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ షురూ
ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వం, ఎల్ఐసీలు కలిసి 60.72 శాతం వాటా అమ్మేందుకు ప్రైవేట్ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. ఇవాళ్టి నుంచే బిడ్లు స్వీకరిస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) వెల్లడించింది. 60.72 శాతం వాటాను అమ్మినా… బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా కొనుగోలుదారులకు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే బ్యాంక్లో మెజారిటీ వాటాతో పాటు బ్యాంక్ నిర్వహణ కూడా ప్రైవేట్ సంస్థ చేతికి వెళుతుంది. నిజానికి ఈ బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.27 శాతం వాటా ఉంది. మొత్తం వాటా కొనేందుకు ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో 60 శాతం వాటా అమ్మాలని ప్రతిపాదించారు. అయితే మేనేజ్మెంట్ ఎవరిదనే అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. ప్రభుత్వ యజమాయిషీ ఉంటే కొనుగోలుదారులు రారని… మేనేజ్మెంట్ కూడా వొదులుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ ఎల్ఐసీకి అసోసియేట్ కంపెనీగా ఉంది. ఇపుడు బ్యాంక్ యాజమాన్యం వొదులుకుంటామని, అయితే కొంత వాటాను మాత్రం కొనసాగిస్తామని ఎల్ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు బిడ్స్ సమర్పించవచ్చు. బిడ్ వేసే వారికి కనీసం రూ. 22500 కోట్ల నెట్వర్త్ ఉండాలి. ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ఫండ్స్,ఎన్బీఎఫ్సీలతో పాటు ఏఐఎఫ్లు కూడా బిడ్ చేయొచ్చు.