హైదరాబాద్‌లో హౌసింగ్ రంగం కళకళ
హైదరాబాద్‌లో రియాల్టి రంగం మళ్ళీ పుంజుకుంటోంది. కమర్షియల్ ప్రాపర్టీ బాగున్నా… హౌసింగ్ రంగ డిమాండ్ కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉంది. ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్‌ఫ్రాంక్ తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ఇళ్ళ అమ్మకాలు బాగా పుంజుకున్నాయి. అమ్మకాలు కరోనా మునుపటి స్థాయికి చేరుకున్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి నగరంలో గృహ విక్రయాలు 5,987 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది క్యూ3లో నమోదైన 1,609 యూనిట్లతో పోల్చితే, అమ్మకాలు మూడింతలకు పైగా పెరిగినట్లు. 2019 ఇదేం కాలంతో పోలిస్తే విక్రయాలు 147 శాతం పెరిగినట్లు. నగరంలో 9,256 యూనిట్లు కలిగిన కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వార్షిక ప్రాతిపదికన 650 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్ల్లడించింది. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా మార్కెట్లలో ఇళ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన స్వల్పంగా పెరిగాయి. మిగతా మార్కెట్లలో మాత్రం దాదాపు స్థిరంగానే నమోదయ్యాయి.
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 64,010 యూనిట్లకు పెరిగాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో 33,403 యూనిట్లు అమ్ముడుపోగా… విక్రయాలు 92 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. ఇళ్ల ధరల్లో స్థిరత్వం, తక్కువ వడ్డీ కే ఇంటి రుణాలు, ప్రజల్లో సొంతింటిపై మోజు ఇందుకు దోహదపడిందన్నారు.
హైదరా‘బాద్‌షా’!
కార్యాలయ స్థలాల లీజులోనూ హైదరాబాద్ జోరుమీదున్నదని, జూలై-సెప్టెంబరు కాలంలో కంపెనీలు 21 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి కుదిరిన 5 లక్షల చదరపు అడుగుల ఒప్పందాలతో పోల్చితే, ఈసారి 363 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన మూడు నెలల్లో 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది.