ఇన్వెస్టర్లను ముంచిన న్యూ జనరేషన్ షేర్లు
నష్టాల్లో ఉన్న జొమాటో షేర్లు ఎందుకు? అని ప్రశ్నిస్తే… సమాధానం అమెరికా మార్కెట్ల గురించి చెప్పేవారు. నాస్డాక్లో సగం కంపెనీలు నష్టాల్లోనే ఉన్నవి తెలుసా? అని ఎదురు ప్రశ్న వేశేవారు. జొమాటోతో దునియా మారిపోతుందని భావించారు. షోరూమ్‌లో చూస్తే కాని.. కారు కొనే పరిస్థితి లేదు. మరి సెంకడ్ హ్యాండ్ కార్లు కూడా ఆన్లైన్లో కొంటారా? అంటే విన్లేదు. జొమాటో షేర్లకు కొత్త తరం ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఏన్నో బ్రోకింగ్ సంస్థలు హెచ్చరించినా విన్లేదు. పేటీఎం షేర్ విలువ రూ. 1200లేనని కొన్ని సంస్థలు రీసెర్చి రిపోర్టులు ఇస్తే కూడా… కమీషన్ల కోసం అందరూ ఆ షేర్లను ఇన్వెస్టర్లకు అంటగట్టారు. అమెరికాలో అమ్మకాల హోరుకు ఇపుడు మనదేశంలో కూడా కుప్పకూలుతున్నాయి. న్యూ జనరేషన్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఐపీఓ తరవాత కూడా ఈ షేర్లను చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేశారు. చక్కటి వ్యాపారం, టర్నోవర్ ఉన్న పాత బిజినెస్ మోడల్ కంపెనీ షేర్లకు కనీస దరఖాస్తు కూడా చేయలేదు. కేవలం ఆరు నెలల్లో సీన్ మారుతోంది. కొత్త తరం షేర్లు ఎంత స్పీడుగా పెరిగాయో అంతే స్పీడుతో పడ్డాయి.
పేటీఎంతో షురూ
పేటీఎం షేర్ ఐపీఓ ధర రూ.2150తో పోలిస్తే 60 శాతం దాకా క్షీణించి ఇపుడు రూ.902కు పడిపోయింది. న్యూ జనరేషన్ ఇన్వెస్టర్ల డార్లింగ్ షేర్ జొమాటొ కూడా ఆఫర్ ధర కన్నా దిగువకు వచ్చేసింది. ఆఫర్ ధర రూ. 115 కాగా రూ. 169కి పెరిగిన జొమాటొ అక్కడి నుంచి రూ. 91.60కి పడింది. అంటే ఆఫర్ ధరకు దిగువన అన్నమాట. ఇష్యూ తరవాత కొత్తగా ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు జేబులకు భారీగా చిల్లు పడింది. పీబీ ఫిన్ టెక్ రూ. 980లకు ఆఫర్ చేశారు.ఈ షేర్ రూ. 1,470కి వెళ్ళి ఇపుడు రూ. 786 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ తరవాత కొన్నవాళ్ళు దాదాపు 50 శాతం నష్టపోయారన్నమాట. ఇష్యూ తరవాత కార్ ట్రేడ్ షేర్ రూ.1618ని తాకింది. ఇపుడు రూ. 777 వద్ద ట్రేడవుతోంది. అంటే సగానికి పైగా మటాష్. ఇక రేట్ గెయిన్ ట్రావెల్ షేర్ ఇష్యూ తరవాత రూ. 525లకు తాకింది. ఇవాళ రూ. 395.40 వద్ద ట్రేడవుతోంది. ఇక మ్యాప్ మై ఇండి (సీఈ ఇన్ఫో సిస్టమ్స్) షేర్ కూడా ఐపీఓ తరవాత రూ. 1913లను తాకింది. ఇపుడు ఈ షేర్ రూ. 1471 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఒక్క రోజే ఈ షేర్ 8.5 శాతం క్షీణించింది. ఇక సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ షేర్ కూడా రూ. 317 నుంచి రూ. 256కు క్షీణించింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ. 216. కాబట్టి ఆఫర్లో షేర్లు పొందినవారు ప్రస్తుతానికి సేఫ్. మ్యాప్ మై ఇండియా, సీఎంఎస్ షేర్లు మినహా ఇక్కడ పేర్కొన్న షేర్లన్నీ ఐపీఓ ధరకన్నా తక్కువకు కోట్ కావడం విశేషం. మార్కెట్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తిన నైకా షేర్ కూడా రూ. 2574 నుంచి రూ. 1791కి పడిపోయింది. అంటే 30 శాతం క్షీణించిందన్నమాట… మార్కెట్ మరింత బలహీనపడితే..ఈ షేర్లు ఇంకా క్షీణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
వీటిల్లో చాలా మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ షేర్ ధరలపై ఓ కన్నేసి ఉంచండి. ఈ డౌన్‌ట్రెండ్‌లో మంచి షేర్లు చౌకగా లభించే అవకాశముంది.