ఓ మై క్రాన్…. మార్కెట్ ఢమాల్
స్టాక్ మార్కెట్లో నిఫ్టి ఇవాళ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఒమైక్రాన్ ఎఫెక్ట్ మార్కెట్‌పై స్పష్టంగా కన్పించింది. అన్నింటికన్నా ప్రధానమైంది… విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నందున… ఈనెలతో ముగిసే త్రైమాసికంలో అనేక కంపెనీలు నిరాశాజనక పనితీరు ప్రకటించనున్నాయి. స్టీల్, సిమెంట్ డిమాండ్ భారీగా తగ్గడం దీనికి సంకేతం. ఇటీవల చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు భారీగా క్షీణించడంతో విదేశీ ఇన్వెస్టర్లకు ఆ మార్కెట్లు ఆకర్షణీయంగా మారాయి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే యూరో మార్కెట్లు లాభాల్లో ఉన్నా, అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోఉన్నా… మన నిఫ్టి భారీగా క్షీణించింది. ఒకదశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా క్షీణించింది. నిఫ్టి కూడా ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,216తో పోలిస్తే 16,891 పాయింట్లకు పడిపోయింది. ఈ లెక్కన 325 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే 284 పాయింట్ల నష్టంతో 16,912 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం 17,200పైన అమ్మినవారికి ఇవాళ లాభాల వర్షం కురిసినట్లే. నిఫ్టిలో కేవలం యూపీఎల్ షేర్ తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి, మిడ్ క్యాప్ నిఫ్టి సూచీలు ఇవాళ 1 శాతంపైగా క్షీణించాయి. నిఫ్టి 1.65 శాతం నష్టం పోగా, నిఫ్టి నెక్ట్స్ దాదాపు రెండు శాతం నష్టపోయింది.