For Money

Business News

నైకా ఐపీఓ… క్షణాల్లో రీటైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి

నైకా పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే రీటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు 1.85 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఇష్యూలో 40 శాతం ఇప్పటికే సబ్‌స్క్రయిబ్‌ అయింది. సాధారణంగా పెద్ద ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన భాగం క్లోజింగ్‌ రోజు అంటే నవంబర్‌ 1న దరఖాస్తు చేస్తారు. వాస్తవానికి 4.75 కోట్ల షేర్లను కంపెనీ ఆఫర్‌ చేయాలని అనుకున్నా… యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన రావడంతో… ఇపుడు కేవలం 2.64 కోట్ల షేర్లను మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారు. ఇష్యూ ధర శ్రేణి రూ. 1,085-రూ. 1,125 కాగా… యాంకర్‌ ఇన్వెస్టర్లతో పాటు ఇతర ఇన్వెస్టర్లు కూడా గరిష్ఠ ధరకు దరఖాస్తు చేస్తున్నారు. నైకా బ్యూటీ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తుండగా, నైకా ఫ్యాషన్‌ దుస్తులను విక్రయిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన యూనికార్న్‌లు ఇంకా నష్టాల్లో ఉన్నవి. కాని నైకా లాభాల్లో ఉన్న కంపెనీ కావడం, పలు అంతర్జాతీయ బ్రాండ్లతో ఈ కంపెనీకి ఒప్పందం ఉన్న కారణంగా దాదాపు ప్రతి బ్రోకింగ్‌ సంస్థ ఈ ఆఫర్‌కు దరఖాస్తు చేయమని సలహా ఇస్తున్నారు. నిజానికి ప్రస్తుత ఆఫర్‌లో 88 శాతం షేర్లు ఇపుడున్న ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు అమ్ముతున్నవే. సాధారణంగా ఈ స్థాయిలో ప్రస్తుత ఇన్వెస్టర్లు అమ్ముతుంటే… బ్రోకింగ్‌ సంస్థలు రెకమెండ్‌ చేయవు. కాని కంపెనీ లాభదాయకత, మార్కెట్‌ను చూశాక… దీర్ఘాకలిక ఇన్వెస్టర్లే గాక… స్వల్ప కాలానికి కూడా ఈ షేర్‌ను కొనొచ్చని సలహా ఇస్తున్నారు.
అనధికార మార్కెట్‌లో…
నైకా షేర్‌కు అనధికార మార్కెట్‌లో భారీ ప్రీమియం లభిస్తోంది. ఈ ప్రీమియం రోజు రోజుకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ షేర్‌ అనధికార మార్కెట్‌లో రూ.1,725 పలుకుతోంది. అంటే 600 లాభం అన్నమాట. కనీసం 50 శాతం లిస్టింగ్‌ లాభాలు ఖాయమని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు.