HYD: ఇళ్ల అమ్మకాలు అదుర్స్
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు తగ్గడం లేదు. కొవిడ్ సమయంలోనూ ఇక్కడ ఇళ్లు/ఫ్లాట్లకు అమిత గిరాకీ లభించింది. 2021లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతా ల్లో 24,410 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడైనట్లు అనరాక్ సంస్థ వెల్లడించింది. గత ఏడాది అంటే 2020లో అమ్ముడైన 8,560 యూనిట్లతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువని ఆ సంస్థ పేర్కొంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ పరిస్థితిపై చేసిన తన సర్వే వివరాలను అనరాక్ సంస్థ వెల్లడించింది. గత ఏడాది దేశంలోనే ఇళ్ల అమ్మకాల్లో అత్యంత భారీ వృద్ధి రేటు హైదరాబాద్‌లోనే నమోదైంది. 2021లో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలూ 3 నుంచి 5 శాతం పెరిగాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లోనే అధిక అభివృద్ధి కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో హైదరాబాద్, దాని సమీప ప్రాంతాల్లో 21,000 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 60 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీసు స్పేస్ లీజు లావాదేవీలు జరగ్గా, 75 లక్షల ఎస్ఎఫ్టీతో బెంగలూరు నగరం హైదరాబాద్ కంటే ముందుంది. ఇక ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లోనూ 2021లో ఇళ్ల అమ్మకాలు పుంజుకున్నాయి. గత ఏడాది హైదరాబాద్‌తో కలుపుకుని ఈ నగరాల్లో 2.36 లక్షల నివాస గృహాలు అమ్ముడయ్యాయి. 2020తో పోలిస్తే ఇది 71 శాతం ఎక్కువ. అయితే కొవిడ్‌కు ముందుతో పోలిస్తే మార్కెట్ ఇంకా నీరసంగానే ఉంది. 2019తో పోలిస్తే ఈ ఏడు ప్రధాన నగరాల్లో 2021లో ఇళ్ల అమ్మకాలు ఇంకా 10 శాతం తక్కువగా ఉన్నాయి. కొవిడ్ ప్రభావం సద్దుమణిగి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఇందుకు ప్రధాన కారణమని అనరాక్ పేర్కొంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పదేళ్ల తక్కువ స్థాయికి దిగి రావడం మరో కారణం. కొవిడ్ కారణంగా 2020లో కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వ్యక్తులు జోరుగా కొనుగోళ్లకు దిగడం, వర్క్ ఫ్రం హోమ్ విధానంతో ప్రజల్లో సొంతింటి కోరిక పెరగడం ఇందుకు మరింతగా దోహదం చేశాయని పేర్కొంది.