For Money

Business News

రాజుగారి కంపెనీ దివాలా

నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీపై దివాలా తీసింది. ఈ మేరకు విక్రయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఫిర్యాదును విచారించిన ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసిం ది. పీఎన్‌బీ ఈ కంపెనీకి గతంలో రూ.327.51 కోట్ల రుణం మంజూరు చేసింది.2008 మార్చి నుంచి 2014 నవంబర్‌ మధ్య కాలంలో అయిదు విడతలుగా ఈ రుణాన్ని మంజూరు చేసినట్లు బ్యాంక్‌ తెలిపింది.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని 129 ఎకరాల భూమిని తాకట్టుగా పెట్టుకుని ఈ రుణం ఇచ్చారు. అలాగే తమిళనాడులోని ట్యుటికోరిన్‌ జిల్లాలోని 280 ఎకరాలను కూడా రుణం కోసం తాకట్టు పెట్టింది కంపెనీ. రాజుకు చెందిన మరో కంపెనీ ఆర్కే ఎనర్జి (రామేశ్వరం) లిమిటెడ్‌కు కూడా ఈ భూములపై హక్కు ఉంది. ఈ భూముల విలువ రూ. 872 కోట్లుగా వ్యాల్యూయేషన్‌ రిపోర్టు ఇచ్చినట్లు పీఎన్‌బీ పేర్కొంది. ఈ రుణ చెల్లింపులో ఇండ్‌ భారత్‌ విఫలమవడంతో ఈ రుణాన్ని 2018 మార్చి 31న ఎన్‌పీఏగా పీఎన్‌బీ ప్రకటించింది. 2019 ఏప్రిల్‌ 8న డీఫాల్ట్‌ నోటీసును జారీ చేసింది. తరవాత ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దివాలా చర్యలకు ఆదేశించిన ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ శ్రీకాకుళం వంశీకృష్ణను తాత్కాలిక మధ్యవర్తిత్వ పరిష్కార నిపుణుడిగా నియమించింది. తమిళనాడులోని తూత్తుకుడి వద్ద ఏర్పాటు చేసే 300 మెగావాట్ల ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పీఎన్‌బీ నుంచి ఈ రుణం తీసుకుంది. పీఎన్‌బీతో పాటు ఇతర బ్యాంకులూ ఇండ్‌ భారత్‌ ధర్మల్‌ పవర్‌ కంపెనీకి మొత్తం రూ.1,384 కోట్ల రుణాలు సమకూర్చాయి. ఈ బ్యాంకుల న్నీ 2019లో ఢిల్లీలోని డెట్‌ రికవరీ ట్రైబ్యూనల్‌ను ఆశ్రియించాయి. త్వరలో మిగతా బ్యాంకులు కూడా పీఎన్‌బీతో చేతులు కలిపి కంపెనీ వేలం ప్రక్రియలో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి.