మార్చి 1 నుంచి H-1B వీసాల రిజిస్ట్రేషన్
H-1B వీసాల రిజిస్ట్రేషన్ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమౌతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది. ఈ ప్రక్రియ మార్చి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2022 నుంచి అమెరికా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది. ఆ ఏడాదికి ఇపుడు రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి మార్చి 31కల్లా కన్ఫర్మేషన్ నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ ఆధారంగా తమ వీసా ఏ స్థాయిలో ఉందో ఆన్లైన్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌తో పాటు ఫీజు కింద పది డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 18 వరకు వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి… సెలక్షన్ నోటిఫికేషన్ సంబంధిత దరఖాస్తు దారుకు పంపుతారు. ప్రతి ఏటా 65,000 హెచ్వన్ బీ వీసాలు, 20,000 వీసాలు యూఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్‌కు కేటాయిస్తారు. ప్రతిసారి 70 శాతంపైగా వీసాలు భారతీయులకే వస్తుంటాయి. 2021 ఏడాది అత్యధిక వీసాల కోసం అమెజాన్ (6182) దరఖాస్తు చేయగా, 5256 దరఖాస్తులతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. విప్రో నుంచి కూడా 2121 దరఖాస్తులు వచ్చాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో అమెరికా వీసాలు నిరాకరించిన దరఖాస్తుల సంఖ్య 4 శాతానికి తగ్గింది. అంటే దాదాపు 96 శాతం మందికి వీసాలు దక్కాయన్నమాట.