ఎల్ఐసీలోకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు
కాంపోజిట్ లైసెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇవ్వనుంది. ఇప్పటి వరకు జీవిత బీమా, వైద్య బీమా, జనరల్ బీమా వ్యాపారాలకు విడిగా లైసెన్స్ తీసుకోవాల్సింది. ఇక నుంచి అన్నింటికి ఒకే లైసెన్స్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే కార్యరూపం దాల్చితే ఎల్ఐసీలోకి ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం చేస్తారు. కాంపోజిట్ బీమా సంస్థలను అనుమతించడంతో పాటు వాటికి అవసరమైన కనిష్ట మూలధనాన్ని నిర్దేశించడం, పెట్టుబడి నిబంధనల్లో మార్పులు చేయడం వంటి అధికారాలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌కు కల్పించే చట్ట సవరణల్ని కేంద్రం ప్రతిపాదించింది. ఎల్ఐసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీల ఉద్యోగులు సానుకూలంగా స్పందిస్తున్నారు.