For Money

Business News

ఇంటి అద్దెపై జీఎస్టీ ఉంది కానీ…

ఇంటి అద్దెపై జీఎస్టీ ఉంటుందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తూ కేంద్ర వివరణ ఇచ్చింది. అద్దెపై కచ్చితంగా 18 శాతం జీఎస్టీ ఉన్న మాట నిజమే. జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో ఈ మేరకు సిఫారసును ఆమోదించారు. ఈ ఏడాది జులై 18 నుంచి జీఎస్టీ కింద నమోదైన కిరాయిదారులు అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని చట్టం చెబుతోంది. అయితే నివాస స్థలాన్ని వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చినపుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగత అవసరాలకు ఒక వ్యక్తిగాని లేదా ఒక భాగస్వామి గాని లేదా భాగస్వామ్య సంస్థగాని అద్దెకు ఇస్తే జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. అదే వాణిజ్య అవసరాలకు ఇస్తే మాత్రం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. వ్యక్తిగత అవసరాలకు ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంటే వారు జీఎస్టీ చెల్లించక్కర్లేదు. జీఎస్టీ కింద నమోదై, వ్యాపారం లేదా వృత్తి పనులు చేస్తున్న వారు అద్దె ఇళ్లల్లో ఉంటే 18 శాతం జీఎస్టీని ఇంటి యజమానికి చెల్లించాలి. చిత్రంగా మున్సిపాలిటీలు కూడా అద్దె ఆదాయంపై పన్ను వసూలు చేస్తుంటాయి.