మళ్ళీ రూ.50,000 దిగువకు బంగారం!
బులియన్ మార్కెట్లో ఒత్తిడి తీవ్రంగా ఉంది. మాంద్యం రావడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో డాలర్ భారీగా పెరుగుతోంది. నిన్న డాలర్ ఇండెక్స్ 109ని కూడా తాకింది. జపాన్ యెన్ 24 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. ఇతర కరెన్సీలు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి బాగా పడుతోంది. డాలర్ పెరిగే కొద్దీ ఆటోమేటిగ్గా బంగారం ధర పడుతోంది. దీంతో పాటు రూపాయి కనుక పడితే నష్టాలుఉ మన మార్కెట్లో అధికంగా ఉంటాయి. రూపాయి ఆర్బీఐ కాపాడుతుండటంతో బంగారం పతనం మన మార్కెట్లో తక్కువే అని చెప్పాలి. అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1713 డాలర్లకు క్షీణించిది. ఇది అయిదు వారాల కనిష్ఠ స్థాయి. అపుడు కూడా బంగారం 1668 డాలర్లను తాకి… అక్కడి నుంచి కోలుకుంది. మరి ఇపుడు కూడా ఆ స్థాయికి వెళుతుందేమో చూడాలి. ఇక ఫార్వర్డ్ మార్కెట్లో స్టాండర్డ్ బంగారం ధర నిన్న రాత్రి రూ. 50402 వద్ద ముగిసింది. రాత్రి బంగారం రూ. 335 నష్టపోయింది. కిలో వెండి కూడా రాత్రి రూ. 1087 తగ్గి రూ. 53,150కి చేరింది. ఇపుడు ఆసియా మార్కెట్లో బంగారం ధర 0.75 శాతం, వెండి 1.7 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అంటే మన బులియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అవుతున్నాయన్నమాట. మరి ఔన్స్ బంగారం 17000 దిగువకు వెళ్ళే పక్షంలో మన మార్కెట్లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ. 50,000 దిగువకు పడే అవకాశముంది.
(ధరలు స్పాట్ మార్కెట్‌కు సంబంధించినవి కావు. అన్నీ ఫార్వర్డ్ మార్కెట్ ధరలు)