బులియన్లో రివర్స్ షాక్
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. వాల్‌స్ట్రీట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమైనా.. డాలర్ భారీగా పెరగడంతో బులియన్ మార్కెట్ ముఖ్యంగా వెండి భారీగా క్షీణించింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ మళ్ళీ అర శాతం పెరిగింది. డాలర్ ఇండెక్స్ 105 దాటడంతో కమాడిటీ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. బంగారం అర శాతం పైగా పడింది. ఔన్స్ బంగారం ధర మళ్ళీ 1800 డాలర్ల దిగువకు వచ్చేసింది. అయితే వెండిలో పతనం మరీ ఘోరంగా ఉంది. ఏకంగా నాలుగు శాతం క్షీణించింది వెండి. వెండి ధర కూడా 20 డాలర్ల దిగువకు వచ్చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్ వీక్‌గా ఉన్నా మన మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది.
సుంకంతో జిగేల్
బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీనికి అదనంగా 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఉండటంతో మొత్తం పన్ను ఇపుడు 15 శాతానికి చేరింది. దీంతో ఇవాళ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.52,200కి చేరింది. మరోవైపు వెండి ధర స్పాట్ మార్కెట్ స్వల్పంగా తగ్గింది. కాని ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి భారీగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా కాకున్నా నాలుగు శాతంపైగా క్షీణించింది. ఎంసీఎక్స్‌లో స్టాండర్డ్ బంగారం ధర ఆగస్టు కాంట్రాక్ట్ ధర రూ. 52032కు చేరి.. ఇపుడు రూ. 51716 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే బంగారం రూ.1201 లాభంతో ఇపుడు ట్రేడవుతోంది. ఇక వెండి సెప్టెంబర్ కాంట్రాక్ట్ ధర రూ. 59800 నుంచి రూ. 57537కు పడిపోయింది. అంటే రూ.2000లకు పైగా క్షీణించిందన్నమాట. ఇపుడు కోలుకుని రూ.1100ల నష్టంతో రూ. 57790 వద్ద ట్రేడవుతోంది. నిజానికి వెండి ఓపెనింగ్‌లో రూ. 59800 ఉండగా, అమెరికా మార్కెట్ ఓపెన్ కాగానే రూ. 57537కు క్షీణించింది.