ఇప్పట్లో బంగారం ధర ఆ స్థాయికి రాదు
బంగారం దిగుమతులపై కేంద్రం సుంకం పెంచడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిన్న కూడా 24 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.52,339 పలికింది. ఇది రెండు నెలల గరిష్ఠ స్థాయి. వాస్తవానికి బంగారానికి ఇది ప్రతిఘటన స్థాయి. ఈ స్థాయిను దాటితే మరింత పెరిగినా… గత గరిష్ఠ స్థాయికి మాత్రం రాదని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ప్యూచర్స్ మార్కెట్లో కూడా ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్ నిన్న ఎంసీఎక్స్‌లో రూ.212 తగ్గి రూ.52,129 పలికింది. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1880 డాలర్లకు చేరుతుందని చాలా మంది ఆశించినా.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా గతవారం 1800 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఇదే స్థాయిలో మరికొంత కాలం బంగారం కొనసాగుతుందని… పాత గరిష్ఠ స్థాయి రూ. 60,000లకు ఇప్పట్లో చేరడం కష్టమని రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ బులియన్ అనలిస్ట్ సుగంధ సచ్దేవ అంటున్నారు. రూ. 48800 స్టాప్‌లాస్‌తో బంగారంలో పొజిషన్ కొనసాగించవచ్చని.. కాని పాత గరిష్ఠ స్థాయి మాత్రం రాకపోవచ్చని అంటున్నారు. భారీగా పెరిగినా రూ. 53000 వరకు చేరుతుందని, అంతకు మించి పెరిగే ఛాన్స్ లేదని పృథ్వి ఫిన్‌మార్ట్‌కు చెందిన కరెన్సీ, కమాడిటీ రీసెర్చి హెడ్ మనోజ్ కుమార్ జైన్ అంటున్నారు. బంగారం రూ.50000లకు పడే ఛాన్స్ ఉందన్నారు. రూ. 60000లకు ఇప్పట్లో చేరదని అన్నారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేవారు బంగారం ఇంకా పడినపుడు కొనాలని ఆయన సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి బంగారం పెరిగే అవకాశముందని ఆయన అంటున్నారు. అంటే పండుగల, పెళ్ళిళ్ళ సీజన్ అన్నమాట. అంతకుముందు బంగారం రూ. 50000 లేదా రూ. 50500లకు చేరే అవకాశముందని అన్నారు. డాలర్ లెక్కలో చెప్పాలంటే 1750 డాలర్లకు ఔన్స్ బంగారం ధర పడే అవకాశముంది.