గద్దె విజయను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్
నిన్నటి దాకా తెలుగు తేజం అంటూ మన్ననలు పొందిన ట్విటర్ మాజీ లీగల్ హెడ్ గద్దె విజయ ఇపుడు అమెరికాతో ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ట్విటర్ ఎలాన్ మస్క్ చేతిలో పడకుండా చివరిదాకా ప్రయత్నించిన విజయను టార్గెట్ చేశాడు టెస్లా అధినేత. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికా ఉపాధ్యుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు సంబంధించిన ఓ కథనం సంచలనం సృష్టించింది. న్యూయార్క్ పోస్ట్ ఆ కథనాన్ని రాసింది. ఉక్రెయిన్‌కు చెందిన వ్యాపార సంస్థలతో బైడెన్ కుమారుడు లావాదేవీలకు సంబంధించి ఓ ల్యాప్‌టాప్‌లో లభించిన సమాచారం ఆధారంగా న్యూయార్క్ పోస్ట్ ఆ కథనం రాసింది. అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయగల ఈ కథనం ట్విటర్లో రాకుండా శతవిధాలా గద్దె విజయ ప్రయత్నించారు. ఈ మేరకు గద్దె విజయకు, ఇతర ఉద్యోగులకు మధ్య జరిగిన ఈమెయిల్స్‌ను ఎలాన్ మస్క్ పరోక్షంగా బయట పెట్టించారు. ప్రపంచాన్ని కుదిపే అంశం త్వరలోనే బయటకు వస్తుదని ఎలాన్ మస్క్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మ్యాట్ తైబి ట్విటర్ ఫైల్స్ పేరుతో వరుసగా ట్విట్లు చేశారు. చిన్నపిల్లల పోర్నగ్రఫికి చెందిన చట్టాలను సైతం ఉపయోగించి బైడెన్ కుమారుడు కుంభకోణానికి సంబంధించిన కథనాలు రాకుండా గద్దె విజయ అడ్డుకున్నారని ఆ ట్వీట్స్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లీగల్ హెడ్ అయిన గద్దె విజయ కీలక పాత్ర పోషించారంటూ ఈమెయిల్స్ గురించి ప్రస్తావించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ట్విటర్ సీఈఓ జాక్ డోర్సికి తెలియకుండా జరిగిందని రాశారు. దీనికి సంబంధించిన మొత్తం సమాచారం తాము వెల్లడిస్తామని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఓ అనామక వ్యాపారస్తుడి నుంచి లభించిన ఆ ల్యాప్‌టాప్‌లో ఉన్న కథనాలకు సంబంధించిన మెటీరియల్‌ను మాజీ అధ్యక్షుడు ట్రంప్ పర్సనల్ లాయర్ రూడి గులియాని మీడియాకు అందించారు. న్యూయార్క్ పోస్ట్‌లో ఈ కథనం వచ్చిన తరవాత ట్విటర్ ఆరంభంలో ఈ కథనం పరిమిత స్థాయిలో వెళ్ళేలా చర్యలు తీసుకుంది. సిలికాన్ వ్యాలీకి చెందిన రోహిత్ ఖన్నా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అమెరికా ప్రజా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈయన కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా మీడియా రాస్తోంది. విజయ గద్దెను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనూ ఎలాన్ మస్క్ ఈ కుంభకోణం బయట పెట్టారని అంటున్నా… విజయ గద్దె చేసిన పనిని మాత్రం సమర్థించడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె జోక్యం చేసుకున్నట్లేనని అంటున్నారు. విజయ గద్దెను జైలుకు పంపాలంటూ రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు.