ఇవాళ షేర్లు కొంటే… రేపే మీ ఖాతాలో
షేర్ల ట్రేడింగ్ కొనుగోలు చేసినా, అమ్మినా మర్నాడే (టీ +1) వాటిని సెటిల్ చేసే పద్దతి ఈనెల 25 అంటే రేపటి నుంచి దశలవారీగా అమల్లోకి రానుంది. అంటే షేర్లు కొన్నా లేదా అమ్మినా దాని తాలూకూ ఎఫెక్ట్ మరుసటి రోజే ఉంటుంది. దీంతో ఇవాళ మీరు షేర్లు కొటే రేపు డీమ్యాట్ ఖాతాలోకి వచ్చేస్తాయి. అలాగే ఇవాళ మీరు షేర్లు అమ్మితే మరుసటిరోజే మీ ఖాతాలో సొమ్ము జమ అవుతుంది. అయితే దీన్ని ఒకేసారి అన్ని షేర్లకు అమలు చేయడం లేదు. దశలవారీగా అమలు చేస్తారు.ఇపుడు ట్రేడింగ్ పూర్తయ్యాక, ఆ తరవాత రెండు రోజులకు (టీ +2) సెటిల్మెంట్ అవుతోంది. ఇక నుంచి ఒక రోజులోనే సెటిల్మెంట్ అవుతుంది.ఇవాళ్టితో ఫిబ్రవరి నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ పూర్తవుతాయి. రేపటి నుంచి మార్చి డెరివేటివ్స్ ప్రారంభమౌతాయి. దీంతో రేపటి నుంచి టీ +1 పద్ధతిని అమల్లోకి తీసుకు వస్తున్నారు. టీ +1 ప్రక్రియను తొలుత మార్కెట్ విలువపరంగా టాప్ 100 స్థానాల్లో ఉన్న కంపెనీలకు అమలు చేయనున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లోని నమోదిత కంపెనీలన్నింటికీ 2023 జనవరి 27 నాటికి ఈ విధానాన్ని పూర్తిగా అమల్లోకి తెస్తారు. మొత్తం 12 దశల్లో జరగనున్న ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. 2023 జనవరి వరకు 5,300 కంపెనీల షేర్లు కొత్త సెటిల్‌మెంట్‌లోకి మారుతాయన్నమాట. పెద్ద కంపెనీల షేర్లలో చాలా వాటికి 2023 జనవరిలో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది జులై 29 నాటికి బీఎస్ఈ నుంచి సుమారు 2,500 కంపెనీలు, ఎన్ఎస్ఈ నుంచి 285 కంపెనీల షేర్లు టీ +1 కు మారతాయి.
Graphix courtesy: shankarmuthu.com/