ధరలు పెరగట్లేదు … బరువు తగ్గిపోతోంది
గత ఏడాది నవంబర్ నుంచి అనేక రకాల వస్తువుల ధరలను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచుతూ వచ్చాయి. ఐటీసీ, హెచ్‌యూఎల్ నుంచి చివరికి చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్ అమ్మే కంపెనీ కూడా ఇక ధరలు పెంచితే జనం కొనలేరనే నిర్ణయానికి వచ్చేశాయి. ఒకవైపు ముడివస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు జనం ఆదాయం పడిపోతోంది. ప్రభుత్వం మాత్రం ద్రవ్యోల్బణం లేదంటోంది. దీనికి కంపెనీలు ఇపుడు కొత్త చిట్కా మొదలు పెట్టాయి. వస్తువుల బరువు తగ్గించడం. ఇలా తగ్గిస్తూ రాగా ఇపుడు పార్లె జి బిస్కెట్ ప్యాకెట్ వంద గ్రాముల నుంచి 60 గ్రాములకు వచ్చింది.దీని ధర రూ.5. తాజాగా దీన్ని ఇపుడు కంపెనీ 55 గ్రాములకు తగ్గించేసింది కంపెని. మొన్నటి దాకా పార్లె మొనాకొ బిస్కెట్ కూడా ఇలా తగ్గుతూ వచ్చి 75.4 గ్రాములకు వచ్చింది. దీని ధర రూ. 10. ధర తగ్గలేదుకాని.. దీని బరువు ఇపుడు 69.6 గ్రాములకు కంపెనీ తగ్గించింది. బ్రిటానియా మిల్క్ రస్క్ గతంలో 72 గ్రాములు ఉండేది. ధర రూ.10. ఇపుడు ధరకు బదులు బరువు 63 గ్రాములకు వచ్చేసింది. రూ. 10ల హల్దీరామ్ భూజియా ప్యాకెట్ 50 గ్రాములు ఉండేది ఇపుడు 42 గ్రాములకు వచ్చేసింది. అలాగే రూ. 10ల లైఫ్‌బాయ్ సబ్సు బరువు 55 గ్రాముల నుంచి 45 గ్రాములకు వచ్చేసింది. పౌడర్, స్నో, సబ్సులు, టూత్ పేస్ట్‌లు ఇలా అన్నింటి బరువు తగ్గిపోతోంది. ధరలు పెరగట్లేదని ప్రభుత్వం ఖుషీగా ఉంది.