PSU బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పెన్షన్ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్పీఎస్ కింద బ్యాంకు యజమాని అందించే మొత్తాన్ని 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. తాజా నిర్ణయం వల్ల బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పెరగనుంది. బ్యాంకు ఉద్యోగి చనిపోతే.. వారు చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం మొత్తాన్ని వారి కుటుంబానికి పెన్షన్‌గా చెల్లిస్తారు. ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ మొత్తం రూ. రూ.30,000-35,000కు పెరగనున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) కార్యదర్శి దేబశిష్ పాండా తెలిపారు. గతంలో ఉద్యోగి తీసుకునే చివరి జీతంలో 15శాతం, 20శాతం,30శాతం స్లాబ్‌తో ఫ్యామిలీ పెన్షన్ ఉండేది. పైగా రూ. 9,284 గరిష్ఠ పరిమితి ఉండేది. ఇపుడు ఆ స్లాబులన్నీ తొలగించి చివరి జీతంలో 30 శాతం ఫ్యామిలీ పెన్షన్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. 2020 నవంబర్ 11న ఐబీఏతో యూనియన్లు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా పెన్షన్‌ను పెంచడంతో పాటు ఎన్పీఎస్కు బ్యాంకు యాజమాన్యాల నుంచి చెల్లించాల్సిన మొత్తం 14 శాతానికి పెంచాలని ఉంది. ఆ ఒప్పందానికి కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ ఆమోదం తెలిపింది.