For Money

Business News

పండోరా పేపర్స్‌లో మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

ఎంతో కీలకమైన డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ (డీజీఎంఐ)గా పనిచేసిన ఆర్మీ అధికారి కూడా నల్లధన స్వర్గధామమైన సీషెల్స్‌లో కంపెనీ ప్రారంభించారు. అతని పేరు లెఫ్టెనెంట్ జనరల్‌ (రిటైర్డ్‌) రాకేష్‌ కుమార్‌ లూంబా. 2010లో సర్వీస్‌ నుంచి రిటైర్‌ అయిన రాకేష్‌ కుమారుడు రాహుల్‌ లూంబాతో కలిసి 2016 డిసెంబర్‌లో సీషెల్స్‌లో ‘రారింట్‌ పార్ట్‌నర్స్‌ లిమిటెడ్‌’ అనే పేరుతో కంపెనీని నెలకొల్పారు. వీరిద్దరితో పాటు ఢిల్లీకి చెందిన అనంత్‌ ఘనశ్యామ్‌ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. పనామా పేపర్స్‌ లీక్ అయిన కొన్ని నెలలకు వీరు ఈ వ్యాపారం చేయడం విశేషం. ఈ కంపెనీకి మారిషస్‌ ఏబీసీ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌లో ఖాతా ఉంది. ఖాతా తెరిచేటపుడు ఆర్జించబోయే టర్నోవర్‌ పది లక్షల డాలర్లు ఉంటుందని పేర్కొన్నారు. అకౌంట్‌లో ప్రారంభ డిపాజిటిగా పది లక్షల డాలర్లు పెట్టారు. తాము కన్సల్టెన్సీ వ్యాపారం చేయనున్నామని, కనీసం 50 లక్షల డాలర్ల వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ అడ్రస్‌తో ఈ కంపెనీ కొనసాగుతుందని కంపెనీ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ కంపెనీ గురించి రాహుల్‌ లూంబాను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వివరణ కోరింది. కంపెనీ పెట్టిన మాట వాస్తవమేనని, దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ పెట్టామని అన్నారు. ఆ తరవాత ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నామని, 2017లో కంపెనీని మూసేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే తాను ఎక్కడా తండ్రి హోదాను ప్రకటించలేదని తెలిపారు.
రాహుల్‌ లూంబా మనదేశంలో కూడా అనేక కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. బీవీవీ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిఫెన్స్‌ వెల్ఫేర్‌ హౌసింగ్‌ అసోసియేషన్‌, ప్రవాసి ఇండియన్‌ ఫౌండేషన్‌, సైనిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా, ఇండో శ్రీలంక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, సమాజ్‌ పీడిత్‌ సేవా ఛారిటబుల్‌ ఫౌండేషన్‌, జన కళ్యాణ్‌ సంవాద్‌ ఫౌండేషన్‌లో రాహుల్‌ లూంబా డైరెక్టర్‌గా ఉన్నారు.