For Money

Business News

మొత్తం ట్విటర్‌ను కొంటాను

ట్విటర్‌ కంపెనీని ప్రైవేట్‌ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని, ట్వీటర్‌ కంపెనీ మొత్తం వాటా కొనేందుకు తాను సిద్ధమని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ఇటీవల ఈ కంపెనీలో మస్క్‌ 9.2 శాతం వాటా కొన్ని విషయం తెలిసిందే. ట్విటర్‌ ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనేందుకు తాను సిద్దమని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే స్వేచ్ఛాయుత భావప్రకటన అత్యవసరమని తాను భావిస్తున్నట్లు ట్వీటర్‌ ఛైర్మన్‌ బ్రెట్‌ టైలర్‌కు రాసిన లేఖలో మస్క్‌ అన్నారు. సెక్యూరిటీ ఎక్స్ఛేంజీకి కూడా ఈ లేఖ పంపారు. ప్రపంచ వ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛకు ట్విటర్‌ వేదికగా మారగలదని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. సెక్యూరిటీ లేఖలో ఆయన పలు అంశాలను పేర్కొన్నారు. కంపెనీ మొత్తం వాటాను ఒక్కో షేర్‌ను 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేస్తానని అన్నారు. ట్విటర్‌లో తాను పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన నాటి ధరతో పోలిస్తే ఇది 54 శాతం అధికమని మస్క్‌ అన్నారు. తాను పెట్టుబడి పెట్టినట్లు బహిరంగ పర్చిన రోజు నుంచి చూస్తే 38 శాతం అధిక ప్రీమియంతో షేర్లు కొనేందుకు రెడీ అని తెలిపారు. ఇది తన ఫైనల్‌ ఆఫర్‌ అని, ఒకవేళ కంపెనీ ఆమోదించకపోతే… వాటాదారుగా తన ప్రతిపాదనను పునః పరిశీలిస్తానని మస్క్‌ అన్నారు. ట్విటర్‌ వృద్ధి చెందేందుకు అసాధారణ అవకాశాలు ఉన్నాయని, దాన్ని తాను అన్‌లాక్‌ చేస్తానని మస్క్‌ అన్నారు. మస్క్‌ వాటా కొన్నట్లు తెలిసినప్పటి నుంచి ఈ షేర్‌ 27 శాతం పెరిగింది. నిన్న రాత్రి 45.85 డాలర్ల వద్ద ముగిసింది. మస్క్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రకటన రాగానే అనధికార మార్కెట్‌లో (ప్రి మార్కెట్‌ డీల్స్‌లో) ట్విటర్‌ షేర్‌ 10.8 శాతం ప్రీమియంతో 50.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.