సగానికిపైగా తగ్గిన పామాయిల్ ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాలయిల్ ధర దాదాపు సగానికి తగ్గింది. విదేశాల నుంచిదిగుమతి చేసుకునే ధరలు 40 శాతంపైగా తగ్గినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో టన్ను పామాయిల్ ధర 1800 డాలర్లు ఉండగా, ఇపుడు 1000 డాలర్లకు లభిస్తోంది. అలాగే సోయా నూనె 45 శాతం తగ్గగా, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు 53 శాతం తగ్గాయి. దీని ప్రభావంతో ఇతర వంటనూనెల ధరలు కూడా తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో కూడా వంటనూనెల ధరలను తగ్గించాల్సిందిగా వంట నూనెల కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అంతర్జాతీయ ఆహార నూనెల ధరల తగ్గుదలకు అనుగుణంగా వంట నూనెల ధరల గరిష్ఠ అమ్మకం ధర (ఎంఆర్‌పీ) చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన వంట నూనెల ధరల తగ్గింపుపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI),ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) సభ్యులు పాల్గొన్నారు. గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ వంట నూనెల ధరలు భారీగా తగ్గాయని, అయితే రిటైల్ మార్కెట్లలో ధరల తగ్గడం లేదని తెలుస్తోంది. అయితే ఈ తగ్గుదల ప్రభావం మార్కెట్‌లో కన్పించేందుకు కొంత కాలం పడుతుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి. కేంద్రం రంగంలోకి దిగడంతో దేశంలో వంట నూనెల రిటైల్ ధరలు త్వరలో తగ్గుతాయని ఆయిల్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.