For Money

Business News

ఇండోస్పిరిట్‌లో కవితకు పరోక్ష వాటా?

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన కంపెనీ అయిన ఇండో స్పిరిట్‌లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తి ప్రదర్శించారని, ఆమె తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌ మహీంద్రుకు అరుణ్‌ పిళ్లై చెప్పినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అరుణ్‌ పిళ్ళై తమ కుటుంబ సభ్యుడులాంటి వాడని, ఆయనతో వ్యాపారం చేయడమంటే కవితతో వ్యాపారం చేయడమేనని కవిత హామి ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. ఇండోస్పిరిట్‌లో అరుణ్‌ పిళ్లైకి 35శాతం వాటా ఉందని ఈడీ అంటోంది. అంటే పరోక్షంగా ఈ వాటా కవితదేనని ఈడీ వాదిస్తోంది. 2021 సెప్టెంబరులో ఢిల్లీలోని తాజ్‌మన్‌సింగ్‌ హోటల్‌లో హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల పెద్దలు కలిశారని… ఆ తరవాత కొద్ది రోజులకు కవితతో సమీర్‌ మహేంద్రు ఫేస్‌టైమ్‌ ద్వారా ఫోన్‌లో మాట్లాడినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అరుణ్‌ ద్వారా జరిగిన ఈ సంభాషణలో కవిత పాల్గొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో సమీర్‌ హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె నివాసంలో కలుసుకున్నారని పేర్కొంది. ఈ సమావేశంలో సమీర్‌, శరత్‌, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత, ఆమె భర్త అనిల్‌ పాల్గొన్నారు. ఇండో స్పిరిట్‌ వ్యాపార వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్‌ పిళ్లై ప్రాతినిధ్యం వహించినట్లు పేర్కొన్నారు. ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నిందితుడు దినేశ్‌ అరోరా కూడా కవితను రెండుసార్లు ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో కలిశారని వెల్లడించారు.