రూ. 2200 పెరిగిన వెండి
అమెరికా డాలర్ ఇవాళ కూడా బక్కచిక్కింది. 105 దిగువన డాలర్ ఇండెక్స్ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇవాళ జపాన్ వడ్డీ రేట్లను పెంచకుండా ఉన్న రేట్లనే కొనసాగించింది. దీంతో డాలర్ ఇండెక్స్ 104 దిగువకు పడిపోయింది. మరోవైపు అమెరికా ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళి మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్ ఒక్కసారిగా మెరిసింది. బంగారం ఒకటిన్నర శాతం పెరగ్గా, వెండి నాలుగు శాతంపైగా పెరిగింది. ఇపుడు ఔన్స్ బంగారం 1824 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌లో బులియన్ భారీగా పెరిగింది. వాస్తవానికి డాలర్ క్షీణించడం, రూపాయి బలపడటం వల్ల మన మార్కెట్‌లో బులియన్ పెరుగుదల కాస్త తక్కువే అని చెప్పాలి. అయినా ఎంసీఎక్స్‌లో వెండి మార్చి కాంట్రాక్ట్ రూ.2200లకు పైగా పెరిగి రూ. 69766లను తాకింది. ఇపుడు రూ.69432 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ. 730 పెరిగి రూ. 54,995ని తాకింది. ఇపుడు రూ.54854 వద్ద ట్రేడవుతోంది.