For Money

Business News

ఆ పద్ధతిలో షేర్ల బైబ్యాక్‌కు దశలవారీగా గుడ్‌బై

స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు షేర్ల బై బ్యాక్‌ చేసే పద్ధతిని దశలవారీగా ఎత్తివేయాలని స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో పలు లోపాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబి ఛైర్‌పర్సన్‌ మదాబీ పురీ బచ్‌ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం షేర్లు బై బ్యాక్‌ చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి స్టాక్‌ ఎక్స్ఛేంజీ ద్వారా రెండోది టెండర్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడం. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్ల బైబ్యాక్‌కు వేరే విండో ఏర్పాటు చేయాలని సెబీ బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే టెండర్‌ ఆఫర్‌ మార్గంలో షేర్ల బైబ్యాక్‌ పూర్తి చేయడానికి గడువును 18 రోజులకు తగ్గించాలని నిర్ణయించారు. అలాగే రికార్డు డేట్‌కు ఒక్క రోజు ముందు వరకు కూడా బైబ్యాక్‌ ధరను సవరించేందుకు అవకాశం కల్పించాలని సెబి నిర్ణయించింది. ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్‌కు పడుతున్న సమయం కూడా తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం షేర్ల బైబ్యాక్‌కు అర్హమైన నిధుల్లో 50 శాతం మొత్తానికి బై బ్యాక్‌ చేయాలని కంపెనీ ప్రతిపాదిస్తే.. వాటిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రూట్‌ ద్వారా చేయొచ్చు. అయితే ఇక నుంచి 75 శాతం నిధులు ఉంటేనే అనుమతి ఇస్తారు. అంటే ఈ రూట్‌ను అనుసరించే కంపెనీల సంఖ్య ఆటోమేటిగ్గా తగ్గుతుందన్నమాట. అలాగే సాంకేతిక కారణాల వల్ల ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడి ఎవరైనా ఇన్వెస్టర్లు నష్టపోతే… దానికి తాము నష్టపరిహారం చెల్లించమని.. అది మా బాధ్యత కాదని సెబి స్పష్టం చేసింది.