ఎర్తిన్ ప్రాజెక్ట్స్ చేతికి ఇందూ ప్రాజె
బకాయిలు చెల్లించ లేక దివాలా తీసిన ఇందూ ప్రాజెక్ట్స్‌ను శ్రీకాళహస్తికి చెందిన ఎర్తిన్ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంది. ఎర్తిన్ ప్రాజెక్ట్స్ దాఖలు చేసిన రూ.620 కోట్ల బిడ్‌కు బ్యాంకర్లు గతంలోనే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని అంగీకరిస్తూ ఎన్సీఎల్టీ, హైదరాబాద్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. 90 రోజుల్లోగా రూ.620 కోట్లు చెల్లించాలని ఎర్తిన్ ప్రాజెక్ట్స్‌కు ఎన్సీఎల్టీ సూచించింది. ఇందు ప్రాజెక్ట్స్ బ్యాంకులకు దాదాపు రూ.4,350 కోట్ల మేరకు బకాయి పడింది. కంపెనీ నుంచి బకాయిలు వసూలు కాకపోవడంతో ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకు, ఇతర బ్యాంకులు 2016లో ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. కంపెనీ ఈక్విటీలో ఎస్బీఐకు 26 శాతం, ఐడీబీఐకి 20 శాతం ఓటింగ్ హక్కు ఉంది. ఇందు ప్రాజెక్ట్స్‌కు చెందిన ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ.23 కోట్లు, ఫైనాన్షియల్ క్రెడిటర్లకు రూ.478 కోట్లు, వర్కింగ్ కేపిటల్ కింద రూ.40 కోట్లు, బ్యాంకు గ్యారెంటీలకు రూ.80 కోట్లు చెల్లించేందుకు ఎర్తిన్ ప్రాజెక్ట్స్ సిద్ధపడింది. ఇందులో రూ. 501 కోట్లు 90 రోజుల్లో చెల్లించనుంది. మిగిలిన రూ. 78 కోట్లకు ఫిక్సెడ్ డిపాజిట్ల గ్యారంటీని, ఇపుడు నడుస్తున్నప్రాజెక్టులకు రూ. 40 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కోసం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో ఈ కంపెనీ ప్రతిపాదనను ఎన్సీఎల్టీ ఆమోదించింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన మూడు కేసుల్లో ఇందు ప్రాజెక్ట్స్‌తో పాటు దీని అనుబంధ సంస్థలైన ఇందు టెక్‌జోన్, లేపాక్షి నాలెడ్జి హబ్ కూడా ఉన్నాయి.