రియాల్టీ కుబేరుడు డీఎల్‌ఎఫ్ అధినేత
రియల్టీ రంగంలో పేరొందిన డీఎల్‌ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ దేశంలో రియల్ ఎస్టేట్ శ్రీమంతుల్లో మొదటిస్థానంలో నిలిచాడు. గత ఏడాదికాలంగా ఆయన సంపద 68 శాతం వృద్ధిచెంది రూ. 61,220 కోట్లకు చేరినట్టు గృహ్ ఇండియా, హురున్ తెలిపాయి. దేశంలోని 14 నగరాల్లో 71 కంపెనీలకు చెందిన రియల్ ఎస్టేట్ శ్రీమంతుల జాబితా ‘గృహ్ హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్’ ఐదో ఎడిషన్‌ను ఈ కంపెనీలు విడుదల చేశాయి. మాక్రోటెక్ డెవలపర్స్ అధిపతి ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో ద్వితీయస్థానంలో ఉన్నారు. 2021 డిసెంబర్ 31నాటికి శ్రీమంతుల సంపదను లెక్కించారు. తాజా జాబితాలో రహేజా గ్రూప్‌నకు చెందిన చంద్రు రహేజా కుటుంబం రూ.26,290 కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది. ఎంబసీ గ్రూప్ నేత జితేంద్ర వీర్వాని రూ.23,620 కోట్ల సంపదతో నాల్గవస్థానంలోనూ, ఒబేరాయ్ రియల్టీకి చెందిన వికాస్ ఒబేరాయ్ (రూ.22,780 కోట్లు) ఐదో స్థానంలో ఉన్నారు. హిరానందన్ కమ్యూనిటీస్‌కు చెందిన నిరంజన్ హిరానందని (రూ.22,250 కోట్లు), ఎం3ఎం ఇండియాకు చెందిన బసంత్ బన్సాల్ కుటుంబం (రూ.17,250 కోట్లు), బాగ్‌మనే డెవలపర్స్‌కు చెందిన రాజా బాగ్‌మానే (రూ.16,730 కోట్లు) వరుసగా 6,7,8 స్థానాల్లో ఉన్నారు.