జూదం కూడా సిగ్గుపడేలా…
షేర్ మార్కెట్ అంటే గిట్టనివారు.. చాలామంది తరుచుగా స్టాక్ మార్కెట్‌ను జూద గృహంగా చెబుతుంటారు. స్టాక్‌మార్కెట్ వర్గాలు ఎన్ని కారణాలు చెప్పినా..దివీస్ ల్యాబ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఇవాళ జరిగింది అదే. దివీస్ ల్యాబ్ దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటి. పలు ఛానల్స్ ఇవాళ విడుదలయ్యే ఫలితాలపై అంచనాలు వెల్లడించాయి. మిడ్ సెషన్లో కంపెనీ ఫలితాలు వచ్చాయి. మార్కెట్ ఆశించినదానికన్నా అద్భుతంగా వచ్చాయి ఫలితాలు. షేర్ ధర పరుగులు పెడుతోంది. అయితే మార్కెట్ అనలిస్టులతో కంపెనీ యాజమాన్యం ఫలితాలు చర్చించింది. వారికి కొన్ని అంశాలపై కంపెనీ వైఖరి చెప్పింది. ఆ సమాచారం తెలుసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ షేర్లను భారీగా అమ్మారు. ఉన్నట్లుండి ఈ షేర్ భారీ పతనం రావడంతో సాధారణ ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. ఎవరికీ ఏం జరుగుతుందో తెలియదు. కేవలం ఒక గంటలో షేర్ ధర పది శాతం తగ్గింది. కాని మార్కెట్లోని చాలా మంది ఇన్‌సైడర్స్‌కు ఈ విషయం తెలుసు. ఆప్షన్స్‌లో ఈ నెల కాంట్రాక్ట్స్ పుట్స్ కొన్నారు. సాధారణంగా షేర్ పెరుగుతున్నపుడు పుట్స్ విలువ బాగా పడిపోతుంది. దీంతో సాధారణ ఇన్వెస్టర్లు వాటిని కొనుగోలు చేయారు. కొంతమంది పంటర్స్ తప్ప. షేర్ భారీ క్షీణించడంతో దివీస్ షేర్ రూ.3800 ‘పుట్’ మే నెల కాంట్రాక్ట్ నిన్న రూ. 1.65 వద్ద ముగిసింది. ఇవాళ కూడా రూ. 2 మించి దాటలేదు. వచ్చే గురువారం సెటిల్మెంట్ క్లోజింగ్ కావడంతో… ఈ కాంట్రాక్ట్‌ను ఎవరూ కొనరు. కాని లోపాయికారీ సమాచారం తెలిసినవారు కొన్నారు. షేర్ ధర పది శాతం పడింది. దీతో ఈ కాంట్రాక్ట్ రూ. 77.30కి చేరింది. చివరికి రూ.75 వద్ద ముగిసింది. అంటే ఈ కాంట్రాక్ట్ ఇవాళ 4,500 శాతంపైగా పెరిగిందన్నమాట. దీని తరవాత రూ.3900 పుట్ కాంట్రాక్ట్ రూ. 4.40ల నుంచి రూ. 107కు చేరింది. అంటే ఒక్కరోజులో 2,331 శాతం లాభం అన్నమాట. నిజానికి ఇవాళ మధ్యాహ్నం 2.15 నుంచి 3.15 మధ్య గంటలో వచ్చిన మార్పు ఇది. దివీస్ రూ.4,000 పుట్ కాంట్రాక్ట్ 1,829 శాతం పెరగ్గా, రూ. 3,700 పుట్ కాంట్రాక్ట్ 1,995 శాతం పెరిగింది. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్ వచ్చచే గురువారం క్లోజ్ అవుతాయి. ఫలితాలు బాగున్నాయని… ధర పెరుగుతుందని భావించిన ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. మార్కెట్ ఇన్సైడర్స్ మాత్రం ఇవాళ కోట్లు సంపాదించారు.