క్రిప్టో కాలింగ్….

మరో టెక్ విప్లవానికి భారత్ వేదిక కానుందా? కరెన్సీ విప్లవానికి మోడీ ప్రభుత్వం స్వీకారం చుట్టనుందా…? అంటే ఔననే సమాధానం వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… డిజిటల్ కరెన్సీకి జై కొట్టడమేగాక… క్రిప్టో కరెన్సీకి బాహాటంగా మద్దతు పలికారు. క్రిప్టో కరెన్సీ అనుకూల చట్టాలు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఇదే సమయంలో అనేక దేశాలు క్రిప్టో కరెన్సీలపై తమ గుడ్డి వ్యతిరేకతను వీడుతున్నాయి. అదే బాటలో భారత్ కూడా నడిచేందుకు సిద్ధమౌతోంది. అయితే క్రిప్టో కరెన్సీపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. నల్లధనానికి ఇది కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించే వారు ఉన్నారు. దీంతో ముందస్తుగా దేశ వ్యాప్తంగా చర్చ జరిపిన తరవాతే క్రిప్టో చట్టాలను తేవాలని భావిస్తోంది మోడీ సర్కారు.
ఫైనాన్షియల్ రంగంలో UPI విప్లవం తెచ్చిన భారత్‌ను అగ్రదేశాలనే ఆశ్చర్యపోయాయి. ఇపుడు క్రిప్టో రంగంలో అదే ట్రెండ్ రిపీట్ చేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. డిజిటల్ కరెన్సీలపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టమైన విధానం లేదు. ఒకవైపు క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించమని పార్లమెంటు సాక్షిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే వర్చువల్ ఆస్తులపై 30 శాతం పన్ను విధిస్తామని బడ్జెట్‌లో వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జూన్‌లో క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం ఓ చర్చా పత్రాన్ని విడుదల చేయనుంది. దీనిపై దేశ వ్యాప్తంగా సంబంధిత రంగాలను సూచనలు, సలహాలను ఆహ్వానించనుంది. క్రిప్టో విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే లోతైన చర్చ తరవాతే దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. కేంద్ర ప్రకటించే క్రిప్టో కరెన్సీ చర్చా పత్రంపై ముఖ్యంగా బ్యాంకింగ్ వర్గాల నుంచి ఆసక్తి వ్యక్తమౌతోంది. భారత అధికారిక కరెన్సీకి ఎలాంటి విఘాతం లేకుండా ప్రభుత్వం తెచ్చే ఈ విధానంపై ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు కూడా ఆత్రంగా ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకు కచ్చితంగా ప్రవేశం కల్పిస్తారా లేదా మొత్తం ప్రభుత్వమే చేపడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రైవేట్ రంగానికి అనుమతి ఇస్తే చైనా వంటి విదేశీ కంపెనీలకు కూడా పాత్ర ఉంటుందా? లేదా నిషేధం విధిస్తారా అన్నది కూడా కీలక అంశమే. ఇప్పటికే పలు అగ్రదేశాలు క్రిప్టో కరెన్సీకి సంబంధించి పలు చర్చా పత్రాలు తెచ్చాయి. ఐఎంఫ్‌తో పాటు ఫైనాన్షియల్ స్టబిలిటీ బోర్డు -FSB రూపొందించి పత్రాల ఆధారంగా భారత ప్రభుత్వం చర్చా పత్రాన్ని రెడీ చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రిప్టో కరెన్సీల విషయంలో తొందర పడే ప్రసక్తే లేదని… అన్ని అంశాలను… అన్ని కోణాల్లో పరిశీలించిన తరవాతే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు అంటున్నారు. మొత్తానికి ఇపుడు దేశ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలపై చర్చ మొదలైంది.