బీజేపీ నేత వాకాటి కంపెనీ డైరెక్టర్‌పై కేసు
నెల్లూరు జిల్లా బీజేపీ నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కంపెనీ డైరెక్టర్ గంజి ప్రవీణ్ కుమార్‌పై సీబీఐ తాజాగా కేసు పెట్టింది. ఒక్క ఐఎఫ్సీఐకి దాదాపు రూ. 205 కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టిన కేసులో వాకాటి నారాయణ రెడ్డి ఇప్పటికే జైలుకెళ్ళి వచ్చారు.ఈయనకు చెందిన వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (వీఐఎల్)కు డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న గంజి ప్రవీవణ్ కుమార్‌పై సీబీఐ అధికారులు తాజాగా మరో కేసు పెట్టారు. రుణాల ఎగవేత కేసు విచారిస్తున్న సీబీఐ అధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ బ్రజేష్ మిశ్రాకు రూ. 41.99 లక్షలు లంచం ఇచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇతరుల అకౌంట్ల ద్వారా బ్రజేష్ మిశ్రా తలిదండ్రుల ఖాతాలకు సొమ్ము మరల్చినట్లు సీబీఐ పేర్కొంది. ఈ చెల్లింపులు 2018 అక్టోబర్ నుంచి 2019 జనవరి మధ్య జరిగాయి. బెంగళూరులోని యలహంకలో రెండు ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఈ సొమ్మును బ్రజేష్ మిశ్రా వినియోగించారు. బెంగళూరు నగర శివార్లలో ఉన్న యలహంక- దొడ్డబళ్ళాపూర్ రోడ్లో ఉన్న ప్రిస్టేజ్ రాయల్ గార్డెన్లో రూ.96,38,040లకు ఒక ఫ్లాటును తండ్రి పేరుతో, తల్లి పేరుతో రూ.95,29,018లతో మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. గంజి ప్రవీణ్ కుమార్ రూ.41.99 లక్షలు లంచం రూపంలో తీసుకున్న బ్రజేష్ కుమార్… మిగిలిన సొమ్మును మరో కేసులో నిందితులుగా ఉన్నవారి నుంచి వసూలు చేశారు. గంజి ప్రవీణ్ రెండు విడతలుగా ఈ సొమ్ము చెల్లించారు. ప్రస్తుతం షిల్లాంగ్‌లో డీఎస్పీగా ఉన్న బ్రజేష్ ఏప్రిల్ 2017 నుంచి 2020 జూన్ వరకు బెంగళూరులో ఉండగా ఈ అవినీతికి పాల్పడ్డాడు.
మరో కేసులో రూ.1.84 కోట్లు
తమిళనాడుకు చెందిన ప్రభాత్ గ్రూప్ ప్రమోటర్ల నుంచి బ్రజేష్ కుమార్ రూ. 1,84,49,999 లంచం తీసుకున్నట్లు తేలింది. ఈ గ్రూప్ బ్యాంకులకు రూ. 415 కోట్లు ఎగ్గొట్టినట్లు కేసు నమోదైంది.2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్య కాలంలో బ్రజేష్ కమార్ ప్రభాత్ గ్రూప్ కేసులు దర్యాప్తు చేస్తుండగా ప్రమోటర్లు హితేష్ ఎస్. పటేల్, దినేష్ హెచ్ పటేల్‌ల నుంచి ఈ లంచం తీసుకున్నారు. నితేష్ మిశ్రా అనే వ్యక్తి ఖాతాల నుంచి ఇంత భారీ మొత్తాన్ని తన తలిదండ్రుల ఖాతాలకు తరలించాడు. ప్రభాత్ గ్రూప్ కంపెనీలలో డైరెక్టర్ కూడా అయిన నితేష్ మిశ్రా లంచానికి కావాల్సిన మొత్తాన్ని ప్రమోటర్లతో పాటు గ్రూప్ కంపెనీల నుంచి సమీకరించి బ్రజేష్ కుమార్ తలిదండ్రులకు బదిలీ చేశారు.
2021లో ఫిర్యాదు
బ్రజేష్కుమార్పై అనుమానం వచ్చిన సీబీఐ అంతర్గతంగా దర్యాప్తు జరిపింది. ఆయన ఆస్తులు కేవలం మూడు సంవత్సరాల్లో 300 శాతం పెరగడంతోపై అనుమానంతో ఐపీఎస్ ఆఫీసర్ సంతోష్ హాదిమణి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా..ఈ సొమ్ము ఈ రెండు కంపెనీల నుంచి వసూలు చేసినట్లు వెల్లడైంది.