కరెంటు ఖాతా లోటు రూ.3 లక్షల కోట్లు
ఈ ఏడాది భారత దేశ కరెంటు అకౌంట్ లోటు గణనీయంగా పెరిగింది. కేవలం మూడు నెలల్లో కరెంటు లోటు రెట్టింపు కావడం ఆందోళనకరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలతో ముగిసిన మూడు నెలల్లో దశ కరెంటు అకౌంట్ లోటు జాతీయస్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 4.4 శాతానికి చేరింది. ఇది 3640 కోట్ల డాలర్ల (సుమారు రూ. 3 లక్షలకోట్లు)ని ఆర్బీఐ పేర్కొంది. అంతకుముందు త్రైమాసికంలో అంటే మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్) కరెంటు ఖాతాలోటు జీడీపీలో కేవలం 2.2 శాతం అంటే 1820 కోట్ల డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) మాత్రమే ఉండేది. అంటే మూడు నెలల్లో కరెంటు ఖాతా లోటు రెట్టింపు అయిందన్నమాట. గత ఏడాది ఇదేకాలంలో అంటే జూలై- సెప్టెంబర్ మధ్య కాలంలో కరెంటు ఖాతా లోటు డీజీపీలో కేవలం 1.3 శాతం అంటే 970 కోట్ల డాలర్లు మాత్రమే ఉండేదని ఆర్బీఐ పేర్కొంది. అంటే ఏడాది క్రితం 970 కోట్ల డాలర్లు ఉన్న కరెంటు ఖాతా లోటు ఇపుడు 3640 కోట్ల డాలర్లకు చేరిందన్నమాట. మన దేశంలో నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 30.2 శాతం పెరగ్గా, విదేశాల నుంచి భారతీయలు మన దేశానికి పంపిన మొత్తం కూడా 29.7 శాతం పెరిగింది. అయితే తయారీ వస్తువుల వాణిజ్య లోటు భారీగా పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో మొత్తం కరెంటు లోటు జెట్ స్పీడ్తో పెరిగింది.