కూలుతున్న క్రిప్టో కరెన్సీ కోటలు
కేవలం రెండు నెలల్లోనే క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ కుదేలైపోయింది. క్రిప్టోలో కనకవర్షం కురుస్తోందని… చాలా లేటుగా ఈ కరెన్సీలలో ఇన్వెస్ట్ చేసినవారు భారీగా నష్టపోయారు. నవంబర్ నెలలో 69,000 డాలర్లు పలికిన బిట్ కాయిన్ ఇవాళ 34,821 వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపు సగం సంపద కరిగిపోయిందన్నమాట. ప్రస్తుతం కాస్త గ్రీన్‌లో ఉన్నట్లు కన్పిస్తున్నా… వాల్‌స్ట్రీట్ పతనం ఫిబ్రవరి వరకు కొనసాగుతుందన్న వార్తలను చూస్తుంటే క్రిప్టోకు గడ్డు రోజులు ఇంకా తొలగనట్లే. ఎథిరీమ్ కూడా 50 శాతంపైగా క్షీణించి 4,826 డాలర్ల నుంచి 2,387 డాలర్లకు చేరింది. విచిత్రమేమిటంటే ఈ ఒక్క రోజే బిట్‌కాయిన్ 16 శాతంపైగా, ఎథిరీయమ్ 20 శాతంపైగా క్షీణించడం. పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ 1.9 శాతానికి చేరడంతో షేర్ మార్కెట్లోఅమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఇన్వెస్టర్లు సురక్షిత, అధిక వడ్డీవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రిస్క్ అత్యధికంగా ఉన్న క్రిప్టో కరెన్సీలలో లాభాలను స్వీకరిస్తున్నారు. ఆరంభంలో ఎంటరైనవారు… లాభాలతో బయటపడుతుంటే… ఇటీవల వీటిని కొన్నవారు భారీ నష్టాలతో లబోదిబోమంటున్నారు. ఫెడ్ గనుక వడ్డీ రేట్ల విషయంలో జోరు పెంచితే క్రిప్టో కరెన్సీలలో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది.