90 డాలర్లను దాటిన క్రూడ్ ఆయిల్
దాదాపు ఏడేళ్ళ తరవాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లను దాటింది. డాలర్ ఇండెక్స్ 97 ప్రాంతంలో ఉన్న సమయంలో క్రూడ్ ఈ స్థాయికి రావడమంటే భారత్ వంటి క్రూడ్ దిగుమతి ప్రధాన దేశాలకు నెగిటివ్ వార్తే. వరుసగా ఆరో వారం క్రూడ్ లాభాలతో ముగుస్తోంది. ఇవాళ అమెరికా మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే 1.4 శాతం పెరిగి 90.59 డాలర్లకు చేరింది. 2014 అక్టోబర్‌లో బ్రెంట్ 91.70 డాలర్లకు చేరింది. ఆ తరవాత ఇదే గరిష్ఠ ధర. మరోవైపు అమెరికా మార్కెట్లో అమ్మే West Texas Intermediate (WTI) క్రూడ్ ఆయిల్ ధర కూడా 1.2 శాతం పెరిగి 87.66 డాలర్లకు చేరింది. ప్రస్తుతం డాలర్‌తో పాటు క్రూరడ్ ధరలు కూడా భారీగా పెరగడానికి కారణం… ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుందన్న వార్తలు. మరోవైపు ఒపెక్ దేశాలు డిమాండ్ మేరకు ఆయిల్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం. ఉక్రెయిన్‌పై దాడులు ఇంకా జరగలేదని, కేవలం ఆందోళన కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పైగా ఫిబ్రవరి 2వ తేదీన ఒపెక్ దేశాల భేటీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయిల్ భారీగా తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.