నీరా రాడియాకు క్లీన్ చిట్
2 జీ స్కామ్ మాదిరిగానే నీరా రాడియా టేపుల కుంభకోణానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులతో మీడియా లాబీయిస్ట్ నీరా రాడియ జరిపిన సంభాషణలను ఐటీ అధికారులు రికార్డు చేసిన విషయం తెలిసిందే. అధికారులతో కుమ్మక్కయి వ్యాపరవేత్తలు భారీగా లబ్ది పొందారని ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కీలక ముద్దాయి నీరా రాడియాకు సీబీఐ ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 14 ప్రాథమిక విచారణలను సీబీఐ జరిపింది. దాదాపు 8000పైగా టేపులు ఉన్న ఈ కేసు మూసివేతకు సీబీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఈ టేపుల వల్ల తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 2007లో జరిగిన ఈ కేసు పలుమార్లు వాయిదా పడింది. తాము నమోదు చేసిన 14 ప్రాథమిక విచారణలో నీరా రాడియా నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లేవని సీబీఐ ఇవాళ కోర్టు దృష్టికి తెచ్చింది. జస్టిస్ వైవీ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును ఇవాళ విచారించింది. సీబీఐ తాజా నివేదికతో ఈ కేసుల కథ కంచికి చేరినట్లే.