సీబీఐ కస్టడీకి చిత్రా రామకృష్ణ
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టు లో హాజరుపర్చింది. ఆమెను 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే వారం రోజులకు కస్టడీకి అనుమతిస్తూ కొన్ని నిబంధనలు విధించింది. ఆమెను సీసీటీవీ పర్యవేక్షణలోనే విచారించాలని, ఆమె తరపు న్యాయవాదులు ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి 24 గంటలకు ఒకసారి ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అంతకముందు కోర్టులో సీబీఐ న్యాయవాది అనేక అంశాలను జడ్జి దృష్టికి తెచ్చారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు చిత్రా సమాధానం చెప్పడం లేదని, చాలా ప్రశ్నలకు సమాధానం దాటేస్తున్నారని పేర్కొంది. అలాగే ఆనంద్ సుబ్రమణ్యంను ఆమె గుర్తించడం లేదన్నారు. ఇద్దరి మధ్య 2500కుపైగా ఈ మెయిల్స్ నడిచాయని … వాటి గురించి విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదే కేసులో సహ నిందితుడైన ఆనంద్ సుబ్రమణియన్‌తో గతంలో తనకున్న సంబంధాన్ని వెల్లడించేందుకు చిత్ర నిరాకరిస్తున్నారని సీబీఐ పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది.