For Money

Business News

వస్తువులపై ఫేక్‌ రివ్యూలు ఇక కుదరదు

ఆన్‌లైన్‌ సంస్థల్లో ఏదైనా వస్తువు కొనాలంటే.. ఇప్పటికే సదరు వస్తువు కొనుగోలు చేసిన కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను చాలా మంది చూస్తారు. ధర నుంచి పనితీరు వరకు ఎలా ఉందో తెలుసుకుంటారు. అయితే ఇలా ఉత్పత్తులపై చాలా మంది ఫేక్‌ రివ్యూలు పెడుతున్నారని.. దీనివల్ల మంచి వస్తువులు అమ్మకాలు కూడా దెబ్బతింటున్నాయని అంటున్నాయి ఈ కామర్స్‌ కంపెనీలు. అలాగే చాలా మంది వారు ఆన్‌లైన్‌ కొన్న ధర లేదా ఇతర చోట్ల ఏ ధరకు కొన్నదీ స్పష్టంగా రాస్తున్నారు. ఒకే వస్తువు ధర వివిధ ఆన్‌లైన్ సంస్థల్లో భిన్నంగా ఉంటోంది. ఇలాంటి రివ్యూల వల్ల చౌకగా ఎక్కడ దొరుకుతోందో తెలిసిపోతోంది. అయితే కొంత మంది ఫేక్‌ ధర పెడుతున్నారని ఈ కామర్స్‌ సంస్థల అభియోగం. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్‌ సంస్థలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, గూగుల్, మెటా, మీషో వంటి కంపెనీలు ఆ కమిటీలో ఉన్నాయి. ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని ఈనెల 25వ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నారు. దీని ప్రకారం ఒక వస్తువుపై ఎవరైనా రివ్యూ చేయాలని అనుకుంటే… రివ్యూ రాసిన వ్యక్తిని ఈ మెయిల్‌ లేదా అడ్రస్‌ లేదా టెలిఫోన్‌ కాల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ లేదా క్యాప్చా సిస్టమ్‌ ద్వారా చిహ్నాలను క్లిక్‌ చేయడం వంటి పద్ధతుల ద్వారా కంపెనీలు వెరిఫై చేస్తాయి. వారు పెట్టే రివ్యూను కంపెనీలు సమీక్షిస్తాయి కూడా. దీనికి గాను రివ్యూల ఫిల్టరింగ్‌, కంట్రోల్‌ టూల్స్‌, అలాగరితమ్స్‌, వెరిఫికేషన్‌, కంట్రోల్‌ ప్రాజెసస్‌ వంటివి కంపెనీలు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.