సుభాష్ చంద్రపై సీబీఐ కేసు
ఆర్‌ఎస్‌ఎస్‌లో మోస్ట్ పవర్ ఫుల్ వ్యక్తుల్లో ఒకరైన జీ గ్రూప్ సుభాష్ చంద్రకు ఎక్కడ ప్రభుత్వంతో చెడినట్లుంది. ఇన్నాళ్ళు వివిధ కేసుల నుంచి కాపాడుతూ వచ్చిన ప్రభుత్వం ఇపుడు పట్టించుకోవడం లేదు. వేల కోట్ల రుణాలు, వందల కేసుల్లో ఎపుడూ వార్తల్లో ఉండే సుభాష్ చంద్రపై తొలిసారి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నాయి. తాజాగా LIC హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సీబీఐకు ఫిర్యాదు చేసింది. సుభాష్ చంద్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి తమ సంస్థకు రూ. 1,322 కోట్ల నష్టం వచ్చేలా కుట్ర పన్నారని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు సుభాష్ చంద్రపై కేసు నమోదు చేశారు. తమ నుంచి రెండు రుణాలు తీసుకున్నారని LICHFL పేర్కొంది. అందులో ఒకటి రూ. 500 కోట్లు కాగా, రెండో రుణం రూ. 480 కోట్లది. ఈ రెండు రుణాలు డిఫాల్ట్ కాగా, వాటిపై వడ్డీతో కలిపి బకాయి రూ. 1322 కోట్లు అయినట్లు LICHFL పేర్కొంది. ఈ రుణాలు పొందేందుకు సుభాష్ చంద్ర ఇచ్చిన నెట్ వర్త్ పత్రాలు తప్పుడు పత్రాలను ఇన్సూరెన్స్ సంస్థ పేర్కొంది. ‘పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ (సహ-రుణగ్రహీత ‘వసంత్ సాగర్ ప్రాపర్టీస్)’కు ఇచ్చిన రూ. 500 కోట్ల రుణం ఇవ్వా, ‘స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సహ రుణగ్రహీత డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్)కు రూ. 480 కోట్ల రుణం ఇచ్చినట్లు LICHFL తన ఫిర్యాదులో వెల్లడించింది.
టేకోవర్, వ్యాపార విస్తరణ కోసం రూ. 500 కోట్లను వసంత సాగర్ తీసుకుంది. ఇది తమ సొంత కంపెనీ అంటూ మార్చి 28, 2018న రుణానికి సొంత గ్యారెంటీ ఇచ్చారు. ఇక రూ. 480 కోట్ల రుణానికి కూడా సుభాష్ చంద్ర సొంత గ్యారంటర్‌గా నిలిచారు. మార్చి 28, 2018న సుభాష్ చంద్ర LICHFLకి సమర్పించిన నెట్ వర్త్ సర్టిఫికేట్‌ను DIM & Co జారీ చేసింది. దీని ప్రకారం సుభాష్ చంద్ర నికర ఆస్తి విలువ సుమారు రూ. 59,000 కోట్లుగా పేర్కొన్నారు. జూలై 6, 2018న MPJ & Co అనే చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ మరో నెట్ వర్త్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ప్రకారం సుభాష్ చంద్ర నికర ఆస్తి విలువ రూ. 40,562 కోట్లు. ఈ రెండు రుణాలను చెల్లించడంలో కంపెనీలు విఫలమయ్యాయని LICHFL తన ఫిర్యాదులో పేర్కొంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, 2016 కింద LICHFL సుభాష్ చంద్రపై కేసు వేసింది. చిత్రంగా తనకు అంత నెట్ వర్త్ లేదని సుభాష్ చంద్ర విచారణ సందర్భంలో పేర్కొన్నారని LICHFL అంటోంది. 2024లో తన నికర ఆస్తి విలువ రూ. 31.79 కోట్లుగా, మరో సందర్భంలో 2017-18లో తన నెట్‌వర్త్ రూ. 40,000 కోట్లని సుభాష్ చంద్ర పేర్కొన్న అంశాన్ని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
వసంత్ సాగర్ ప్రాపర్టీస్, పాన్ ఇండియా ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, స్పిరిట్ ఇన్‌ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ అనే ప్రైవేట్ కంపెనీల రుణగ్రహీతలతో సుభాష్ చంద్ర కుమ్మక్కు అయ్యారని LICHFL ఆరోపిస్తోంది. కంపెనీల అధికారులు, డైరెక్టర్లు LICHFLను మోసగించి రుణాలు పొందారని, ఆ సొమ్మును దుర్వినియోగం చేశాయని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. ప్రధాన రుణగ్రహీతలకు నిధులను కేటాయించేలా LICHFLను మోసం చేయడానికి, చంద్ర తన నికర ఆస్తి విలువను పెంచి, తప్పుడుగా చూపించడానికి నకిలీ పత్రాలను సృష్టించారని కూడా ఆరోపించింది. “నిధులను దుర్వినియోగం చేయడంలో నిందితులు LICHFL ఉంచిన నమ్మకాన్ని ఉల్లంఘించారు,” అని ఆరోపించింది.
