రేవంత్ ఆస్తులు… ఈడీ జప్తు రద్దు
ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో ఊరట లభించింది. ఈకేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 2021లో రూ. 50 లక్షల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. అయితే ఈ జప్తును సవాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్, రుద్ర శివకుమార్ ఉదయ సిన్హా, బిషప్ హరి సెబాస్టియన్‌లు అప్పీల్ ట్రైబ్యూనల్‌లో సవాలు చేశారు. కేసును విచారించిన ట్రైబ్యూనల్ ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ నేతృత్వంలోనే బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. 2015కు సంబంధించిన ఈ కేసులో 50 లక్షల రూపాయలను ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకుని కోర్టు కస్టడీలో ఉంచినందున, వేరే సమానమైన ఆస్తులను జప్తు చేసే అధికారం ఈడీకి లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. 2015 మే నెలలో తెలంగాణ శాసనమండలి ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి అప్పట్లో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.
